వేగంగా పొలిటికల్ సీన్ మారుతుంది

వేగంగా పొలిటికల్ సీన్ మారుతుంది

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల్లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారతాయన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు... ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పేలాలేదనే పరిస్థితులు కనిపిస్తున్నాయని జోస్యం చెప్పిన ఆయన... కొన్ని రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారి అనూహ్య పరిణామాలు ఉంటాయన్నారు. “మనం పని చేస్తున్నాం... కానీ, ప్రచారం చేసుకోవడం లేదంటూ సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించిన జీవీఎల్... మీరు చేసుకుంటుంది కేవలం ప్రచారమే కదా? అంటూ ఎద్దేవా చేశారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో ఇల్లు కేటాయిస్తే దానికి చంద్రన్న అని పేరు పెట్టుకున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. ప్రచారమే ప్రభుత్వ విధానం, నినాదం అనే తీరుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆయన మండిపడ్డారు.

సీఎం చంద్రబాబు దీక్షల పేరితో రూ. 32 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు జీవీఎల్ నర్సింహారావు... దీనిపై నిజనిర్ధారణ చేస్తే ఆ ఖర్చు రూ.100 కోట్ల రూపాయల పైనే ఉంటుందన్నారు. సీఎంకు వ్యవసాయంపై, రైతుల పట్ల శ్రద్ధ, ఆదరణ లేదని విమర్శించారు. 2004 ఎన్నికల్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి రావడం ఖాయమని జోస్యం చెప్పిన జీవీఎల్... కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు. కర్నాటకలో ప్రజల ఆదరణ భారతీయ జనతా పార్టీకే ఉందని... బీజేపీయే తప్పకుండా అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.