ప్రధాని మోడీని దుర్యోధనుడితో పోల్చిన ప్రియాంక గాంధీ

ప్రధాని మోడీని దుర్యోధనుడితో పోల్చిన ప్రియాంక గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మహాభారతంలో దుర్యోధనుడితో పోల్చారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా. హర్యానాలోని అంబాలాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా మోడీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికలు ఏ ఒక్క కుటుంబానికి సంబంధించి జరగడం లేదని, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో, హర్యానాలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడినపుడు ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం చేశారు కానీ 5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయని ప్రియాంక గుర్తు చేశారు. వీటిలో 5 లక్షలు కేవలం పెద్దనోట్ల రద్దు కారణంగా జరిగిందని ఆరోపించారు. తన ప్రసంగంలో మహాభారతం ప్రస్తావన తెస్తూ చరిత్రలో దేశం ఎప్పుడూ అహంకారాన్ని సహించలేదన్నారు. ఇలాంటి అహంకారం దుర్యోధనుడిలో కూడా ఉందని చెప్పారు. కృష్ణ భగవానుడు దుర్యోధనునికి హితోపదేశం చేయబోతే ఆయనను బందీ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆ తర్వాత ప్రియాంక వాద్రా జాతీయ కవి రామ్ ధారీ సింహ్ దిన్ కర్ కవిత చదివి వినిపించారు. 'జబ్ నాశ్ మనుజ్ పర్ ఛాతా హై, పెహ్లే వివేక్ మర్ జాతా హై, హరి నే భీషణ్ హుంకార్ కియా, అప్నా స్వరూప్ విస్తార్ కియా, డగ్ మగ్-డగ్ మగ్ దిగ్గజ్ డోలే, భగవాన్ కుపిత్ హోకర్ బోలే "జంజీర్ బఢా కర్ సాధ్ ముఝే, హా హా దుర్యోధన్. బాంధ్ ముఝే. (మనిషికి నాశనమయ్యే కాలం దగ్గర పడితే, ముందు వివేకం మరణిస్తుంది, హరి భీకర హుంకారం చేశారు, తన స్వరూపాన్ని విస్తరించారు, మహామహులంతా గడగడా వణికిపోయారు, భగవానుడు ఆగ్రహంతో అన్నారు "గొలుసులు పెంచి నన్ను అదుపు చేయి, హా హా దుర్యోధన్. నన్ను కట్టు")' ప్రియాంక గాంధీ కవితా గానాన్ని ప్రజలు ఎంతగానో స్వాగతించారు. మన దేశ ప్రజల వివేకంగా ఎంతో గొప్పదని ప్రియాంక అన్నారు. మహాభారత కాలం నుంచి అందరికీ గట్టి జవాబులు ఇస్తూ వస్తోందని చెప్పారు.

కాంగ్రెస్ అంశాలపై పోరాడుతోందని, కానీ బీజేపీ అగ్రనేతలు దేశవిదేశాల్లో తిరుగుతారు తప్ప గ్రామాలకు వెళ్లరని ప్రియాంక వాద్రా విమర్శించారు. మహిళలను, రైతులను ఎప్పుడైనా మీ సమస్యలపై ఏం చేయాలని కోరుకుంటున్నారని అడిగారా? అని ప్రశ్నించారు. రాహుల్ కాంగ్రెస్ మేనిఫేస్టో తయారు చేయడానికి ముందు పార్టీ నేతలను దేశవ్యాప్తంగా పంపించారని గుర్తు చేశారు. ఈ మేనిఫెస్టోలో నిరుపేదలకు ఏటా రూ.72,000 ఇచ్చే న్యాయ్ ప్రస్తావన ఉందని చెప్పారు. రూ.10,000 కోట్లు పారిశ్రామికవేత్తలకు ఇచ్చారని ప్రియాంక దుయ్యబట్టారు. అందరికీ రూ.15-15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ వాళ్ల అధ్యక్షుడు ఎన్నికల తర్వాత ఉత్త గారడీ అని తేల్చి చెప్పారని నిప్పులు చెరిగారు. 

ప్రియాంక గాంధీ దుర్యోధనుడి పోలికకు జవాబుగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. మే 23న ఎవరు దుర్యోధనుడు, ఎవరు అర్జునుడో తేలుతుందని అన్నారు. 'ఇప్పుడిప్పుడే ప్రియాంక గాంధీ మోడీని దుర్యోధనుడని అన్నారు, ప్రియాంకజీ దేశ ప్రజలు ఎవరు దుర్యోధనుడు, ఎవరు అర్జునుడని నిర్ణయించారో మే 23న నిర్ణయిస్తారని' షా చెప్పారు.