హీరో శివాజీపై దాడికి యత్నం...

హీరో శివాజీపై దాడికి యత్నం...

గన్నవరం విమానాశ్రయంలో తెలుగు హీరో శివాజీపై దాడి యత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహిస్తున్న కీలక భేటీకి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయంకు మరి కాసేపట్లో చేరుకోనున్నాడు కన్నా లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో కన్నాకు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో హీరో శివాజీ కూడా గన్నవరం విమానాశ్రయంలో ఉన్నాడు. ఇరువురి మధ్య కొద్దిపాటి తగాదా తలెత్తడంతో.. శివాజీపై దాడికి ప్రయత్నించారు బీజేపి కార్యకర్తలు. శివాజీ కూడా వారిపై తిరగపడ్డాడు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని.. శివాజీని పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఈ గొడవ సద్దుమణిగింది. బీజేపీకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకొనేది‌ లేదని హెచ్చరించారు బీజేపీ కార్యకర్తలు.

శివాజీ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లు సమాచారం. ప్రత్యేక హోదా పేరుతో శివాజీ ఇంతకుముందు బీజేపీని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు శివాజీని అడ్డుకున్నారు.