సీట్లే కాదు.. ఓట్లూ గోవిందా

సీట్లే కాదు.. ఓట్లూ గోవిందా

ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న వేళ... బీజేపీ హవా తగ్గుతోంది అనటానికి తాజా ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కమలం గ్రాఫ్ నేల చూస్తోంది. ఆ పార్టీ నేతల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బీజేపీకి కేవలం సీట్లే కాదు ఓట్ల శాతం కూడా దారుణంగా తగ్గుతోంది. సీట్లతో పాటు ఓట్లు కూడా తగ్గటంతో కమలనాథుల్లో టెన్షన్ మొదలైంది. మొన్న జరిగిన కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు సాధించినా.... ఓటు పర్సెంటేజ్ భారీగా తగ్గింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు శాతం భారీగా పెరిగింది. తాజా ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి దెబ్బే తగిలింది. మొత్తం 14 స్థానాల్లో ఎన్నికలు జరిగితే కేవలం మూడింటిలో మాత్రమే బీజేపీ గెలిచింది. అదీ బొటా బొటీ మెజారిటీతోనే. 

కమలం రేకులు ఒక్కటొక్కటిగా రాలుతుంటే ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం మొదలైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్లు ఎక్కువే. నాలుగేళ్లలో జరిగిన పలు ఉపఎన్నికల్లో 10 సీట్లను బీజేపీ కోల్పోయింది. ఎంపీల సంఖ్య 272కు పడిపోయింది. తాజా ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం గత ఎన్నికలతో పోలిస్తే బాగా తగ్గింది. ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్ల శాతం పెరుగుతూ ఉంది. దీంతో బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకుల అంచనా. బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోవటం ఆ పార్టీ అధినేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. 

బీజేపీ ఓట్ల శాతం భారీగా తగ్గుతోంది అనటానికి కైరనా ఫలితమే నిదర్శనం. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కైరానాలో 50.6 శాతం ఓట్లు లభించాయి. అదే పునరావృతం అవుతుందని లెక్కలు వేశారు. కాని ఆ లెక్కలు తిరగబడ్డాయి. ఈసారి కేవలం 45శాతం ఓట్లను మాత్రమే సాధించారు. గోరఖ్ పూర్, ఫుల్పూర్లలో ప్రతిపక్ష ఐక్యతకు స్పష్టంగా కనిపించింది. విపక్షాలు ఐక్యతతోనే బిజెపి ఓట్ల శాతాన్ని తగ్గించగలిగాయి. మిగిలిన మూడు ఫలితాల్లో కూడా అదే పరిస్థితి. పాల్ఘర్, భండారా-గోండియాలలో ఓట్ల శాతం దారుణంగా పడిపోయింది. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన మిత్రపక్షాలు. 

సాధారణ ఎన్నికల తర్వాత 27లోక్‌సభ సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో 13 నియోజకవర్గాలు బీజేపీవే. అయితే.. వీటిలో తిరిగి 5 నియోజకవర్గాలను మాత్రమే సొంతం చేసుకుంది కమలం. మిగిలిన 8 సీట్లలో ఓడిపోయింది. మరోవైపు... నాగాలాండ్‌లో గత ఎన్నికల్లో బీజేపీకి 68.7 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా 41.3 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. పాల్ ఘర్‌లో బీజేపీ పరిస్థితి ఇంకా ఘోరం. ఇక్కడ బీజేపీ గెలిచినప్పటికీ ఓట్ల శాతం 30.8కి పడిపోయింది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీకి 53.7 శాతం ఓట్లు వచ్చాయి. 

భండారా-గోండియాలోనూ బీజేపీ గత ఎన్నికల్లో 50.6 శాతం ఓట్లు రాగా, ఈసారి 41.5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక్కడ ఎన్సీపీ గణనీయమైన ఓట్లు సాధించింది. గత ఎన్నికల్లో 14.3 శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఎన్సీపీ ఈసారి ఏకంగా 46.6 శాతం ఓట్లు కొల్లగొట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని మహేస్తలో కొంత పుంజుకోవటం కమలనాథులకు ఊరట కలిగించింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం మెరుగైంది. యూపీలోని నూర్‌పూర్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడది 47.2 శాతానికి పెరిగింది. యూపీ, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీకి ఆందోళన నెలకొంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో చెన్నగన్నూరులో ఓటు శాతం 23.2 శాతానికి తగ్గింది. 

నాలుగేళ్లలో బీజేపీకి ఇంతగా ఓట్ల శాతం తగ్గటానికి కారణం ప్రజల్లో ఆ పార్టీపై ఆదరణ తగ్గటమే. ముఖ్యంగా మోడీ చేసిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇవ్వకపోగా.... జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటివి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయనే అభిప్రాయం ఉంది. దీంతో పాటు రోజు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనం అల్లాడుతున్నారు. నిత్యవసరాల ధరలు కూడా చుక్కలు చూపుతున్నాయి. వెరసి మోడీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి.