ఇలాంటివి పాకిస్థాన్‌లోనే జరుగుతాయి: రాహుల్

ఇలాంటివి పాకిస్థాన్‌లోనే జరుగుతాయి: రాహుల్

దేశంలో భయానక వాతావరణం నెలకొందని, రాజ్యాంగం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీ నియంతలా పాలిస్తున్నారని అన్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులే న్యాయం కోసం ప్రజల మద్దకు రావడం పరిస్థితి తీవ్రతను చెబుతోందన్నారు. దేశంలో న్యాయవాదులను భయపెడుతున్నారని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని విమర్శించారు.

దేశం తరఫున గొంతు విప్పాల్సిన  కోర్టులు, స్వతంత్ర సంస్థలు నియంత్రణకు గురవుతున్నాయన్నారు. దేశంలోని ప్రజాస్వమ్య సంస్థల్లోనూ జోక్యం చేసుకునేందుకు ఆరెస్సెస్ ప్రయత్నస్తోందని అన్నారు. ఆఖరికి.. పార్లమెంటులో కొంతమంది బీజేపీ ఎంపీలను చూస్తుంటే  సుప్రీంకోర్టు జడ్జిల మాదిరిగా అణిచివేత కింద ఉన్నట్టు కనిపించారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ఇటువంటి  పరిస్థితులు పాకిస్థాన్‌తోపాటు కొన్నా ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయన్నారు. దేశ వ్యాప్తంగా భయాందోళన నెలకొందని రాహుల్‌.. ఇలాంటి పరిస్థతి గత 70 ఏళ్లలో ఎన్నడూ తలెత్తలేదన్నారు.

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి  ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం మన దేశ దౌర్భాగ్యమని రాహుల్‌ పేర్కొన్నారు. ఇవాళ కర్ణాటకలో భారత రాజ్యాంగంపై దాడి జరిగిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఓవైపు.. గవర్నర్‌ మరో వైపు ఉన్నారని చెప్పారు. దేశంలో బీజేపీ భయానక వాతావరణాన్ని నెలకొల్పుతోందని.. దళితులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు తమ కలలను సాకారం చేసుకోకుండా అడ్డుకుంటోందన్నారు.