ఎన్నికల్లో పోటీ చేయకుండానే బీజేపీ-శివసేనలకు షాకిస్తున్న రాజ్ థాకరే

ఎన్నికల్లో పోటీ చేయకుండానే బీజేపీ-శివసేనలకు షాకిస్తున్న రాజ్ థాకరే

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఈ లోక్ సభ ఎన్నికల్ల్లో పోటీ చేయడం లేదు. కానీ ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే అధికార బీజేపీ-శివసేన కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్-ఎన్సీపీలకు అప్రకటిత స్టార్ క్యాంపెయినర్ గా మారిన రాజ్ థాకరే విరామం లేకుండా రాష్ట్రంలో ఎన్నికల పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఆడియో, విజువల్ సహకారంతో పెద్ద తెరలపై రుజువులు చూపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్ థాకరే ప్రచారం ఓటర్లను కూడా ఆలోచనలో పడేస్తోంది. ఆయన బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు.

రఫెల్ కేసు, రైతుల దుస్థితి లేదా బాలాకోట్ వైమానిక దాడులు.. అంశం ఏదైనా రాజ్ థాకరే ఎలక్ట్రానిక్ మీడియా ఆర్కైవ్ ల నుంచి సేకరించిన సాక్ష్యాలతో కేంద్రంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సాక్ష్యాధారాలకు తన ఆకర్షణీయమైన మాటలను జోడించి ప్రజల మనసులను గెలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద తెరలపై థాకరే ప్రదర్శిస్తున్న వార్తలు, ఫుటేజీల వినియోగం చూసి కాంగ్రెస్-ఎన్సీపీ శ్రేణులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. 

'తన మాటలు నిజమని రుజువు చేసేందుకు రాజ్ థాకరే సోషల్ నెట్ వర్క్, టీవీ ఫుటేజీలను సమర్థంగా వినియోగిస్తున్నారు. ఆయన పూర్తిగా అభ్యాసం చేసిన తర్వాత తన ప్రసంగాలు చేస్తున్నారని' ప్రకటనలు, థియేటర్ల కళాకారుడు అజిత్ భూరే అంటున్నారు. రాజ్ థాకరే తన పూర్తి సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా సేకరించి వాటిని క్రోడీకరించి చెబుతున్నారని ఆర్థిక శాస్త్రవేత్త అజిత్ రానాఠే చెబుతున్నారు. ఓటర్లు కూడా రాజ్ థాకరే కొత్త తరహా ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. 'మహారాష్ట్రలో ఇంతకు ముందు ఇలాంటి టెక్నిక్ ఏ నేత ఉపయోగించలేదు. సాధారణంగా వేదికపై ఎవరైనా నేత మాట్లాడుతుంటే బోర్ కొడుతుందని' ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్చిస్ పటేల్ అన్నారు. 

రాజ్ థాకరే టెక్నికల్ టీమ్ ఆయనకు సహకారం అందిస్తున్న తీరు చూసి మిగతా నేతలు, వాళ్ల అనుయాయులు ఎంతో నేర్చుకోవాలి. ఎంఎన్ఎస్ చీఫ్ ఒక నగరం నుంచి రెండో నగరానికి వెళ్లినపుడు అక్కడి పరిస్థితులు, స్థానిక సమస్యలను బట్టి తన స్క్రీన్ ప్లే మార్చేసుకొని స్థానిక అంశాలను జోడించి వదులుతారని ఆయనతో పనిచేస్తున్న వాళ్లు వివరిస్తున్నారు. ప్రసంగిస్తూ మధ్యలో కాసేపు ఆపి అది ప్లే చేయండి, ఇది ప్లే చేయండి అని రాజ్ సూచించిందే తడవుగా టెక్నికల్ టీమ్ వెంటనే ఆయన కోరిన అంశాలను ప్లే చేస్తుంది. వేదికకు ఇరువైపులా ఉన్న పెద్ద తెరలపై ఆయా విషయాలను, వాటి నిజానిజాలను అక్కడే అప్పటికప్పుడే ఎంఎన్ఎస్ అధినేత నిగ్గు తేల్చేస్తారు. దీంతో సభలకు వచ్చిన జనంలో కూడా ఆయన ప్రసంగాలకు విశేష స్పందన వస్తోంది.

కాంగ్రెస్-ఎన్సీపీలు తమ వేదికపైకి వచ్చి ప్రచారంలో పాల్గొనాలని, ప్రసంగించాలని కోరుతున్నాయి. కానీ ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. రాజ్ థాకరే నాందేడ్ పర్యటన అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలిచిన మాజీ సీఎం అశోక్ చౌహాన్ కి మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్ థాకరే ఇప్పటి వరకు షోలాపూర్, కోల్హాపూర్, పూణె, రాయిగఢ్, ముంబై, నాసిక్, హట్ కాంగలే, సతారా, పన్వేల్ లలో పర్యటించారు. ముంబై సౌత్ లోక్ సభ సీటులో ప్రచారం చేస్తూ రాజ్ థాకరే, కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరా తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ప్రచారం చేస్తున్నారంటేనే మోడీ సర్కార్ కి అధికారం కల్లే అనడానికి సూచన అని పేర్కొన్నారు. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్వేస్ వ్యవహారంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకొని ఉండాల్సిందని రాజ్ థాకరే అన్నారు.