తెలకపల్లి రవి  : అమరావతి కాదు,అధికారంవైపే బిజెపి చూపు

తెలకపల్లి రవి  : అమరావతి కాదు,అధికారంవైపే బిజెపి చూపు

తెలకపల్లి రవి

              ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణ స్వీకారంలో ఆ పార్టీ జాతీయ నేత రామ్‌మాధవ్‌  తమ రాజకీయ వ్యూహాన్ని సూటిగానే చెప్పేశారు.  వీర్రాజుతో సహా ఇతర నాయకుల మాటు కూడా 2024 ఎన్నిక గురించే ఎక్కువగా నడిచాయి తప్ప అమరావతి గురించి కాదు. రాజధాని మార్పునకు మేము వ్యతిరేకం అంటూ ఆవాక్యం పూర్తవకుండానే అయితే కేంద్రం జోక్యం వుండదు అని అంతకంటే గట్టిగా చెప్పడం మాములుగా జరిగేది కాదు. నిజంగా వ్యతిరేకమైతే రెండో భాగం ఎక్కువగా నొక్కి చెప్పడం జరగదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక రాజధాని వున్నప్పుడు ఏ విధంగా అవినీతిపై పోరాడామో ఇప్పుడు మూడు రాజధానులోనూ అవినీతి జరిగితే పోరాడతామని రాం మాధవ్‌ అన్నారు. అప్పుడు తామూ ఆ  నిర్ణయంలో నిర్వహణలో భాగమని  బిజెపి నేతలు ఎప్పుడూ మర్చిపోతుంటారు.

        వాస్తవానికి సోము వీర్రాజు పగ్గాలు చేపట్టాక  చర్చ ఎక్కువగా ఆయన నాయకత్వం భవిష్యత్‌ వ్యూహల గురించి కాక రాజధాని మార్పుపైనే కేంద్రీకృతమైందంటే దానికి కారణం ఆయన, అంతకు మించి ఆ పార్టీ ద్వంద్వ రాజకీయం మాత్రమే. చివరి రైతులకు న్యాయం జరిగే వరకూ తాము కట్టుబడి వుంటామని లేదంటే 2024లో అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తామని  వారు చెబుతున్నారు. జనసేనతో కలిసి అధికారంలోకి రావడం గురించి తరచూ మాట్లాడుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా అందుకు గొంతు కలపడం మరో విశేషం. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ ప్రధానమైనవని వ్యక్తిగత నిర్నయాలను బట్టి నడుస్తాయని చెప్పిన వీర్రాజు తాము మోడీ తత్వాలను స్థాపించడానికి పనిచేస్తామని చెప్పడం విడ్డూరం. మరోసారి మూడు రాజధాలను శంకుస్థాపనకు ప్రధానిమోడీ వస్తారని వైసీపీ ప్రభుత్వం చేసే ప్రచారం నిజం కాకపోవచ్చని మాలాంటి వారు చెప్పాడమే గాని బిజెపి నేతలు నోరు మెదపలేదు. మరో వైపున చంద్రబాబు నాయుడు అయోధ్యనూ అమరావతిలా పోల్చి మాట్లాడుతూ బిజెపి ఎజెండా తాను హైజాక్‌ చేసే ప్రయత్నానికి దిగారు. వైసీపీ కూడా సూటిగా బిజెపిని విమర్శించిన దాఖలాలు ఇంతవరకూ లేవు. జనసేన నేరుగానే జట్టుకట్టింది. ఈ విధంగా మూడు ప్రాంతీయ పార్టీలు బిజెపికి అనుకూలంగా వుండటం వారి పని తేలిక చేస్తున్నది. ప్రత్యేక హోదా నిరాకరణ నిధులు, విభజన సమస్య విషయంలో నిర్లక్ష్యం మరుగునపరుస్తున్నది. ఎన్నిక ముందు ధర్మయుద్ధం చేసిన చంద్రబాబు ఇప్పుడు అవసరాన్ని మించి బిజెపినీ కొనియాడుతుంటే వైసీపీ నేతలు ఆ పార్టీని విమర్శించాలంటే అందులో చేరిన టిడిపి వారిని అడ్డంపెట్టుకునిగాని మాట్లాడలేకపోతున్నారు.

             ఏపీ విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రజల్లో  నిరసనలు వుండి...  ఇప్పుడు రాజధాని సమస్యలోనూ వారి మాట గారడీ చూస్తున్నారు. బిజెపి పునాది చాలా నామమాత్రం కాగా... వారు ఆకర్షణశక్తిగా భావిస్తున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్నారు. ఉత్తరాది తరహా మత రాజకీయాలు  ఏపీలో  చలామణి కావడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య తాము 2024 ఎన్నికలో గెలిచేస్తామని ఇప్పటినుంచి చెప్పుకోవడం ప్రచారానికి పనికి రావచ్చు గాని ప్రయోజనం శూన్యం.