కేటీఆర్‌ లేఖలో పచ్చి అబద్దాలు.. గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలను నిలదీయండి..!

కేటీఆర్‌ లేఖలో పచ్చి అబద్దాలు.. గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలను నిలదీయండి..!

తెలంగాణలో ఉద్యోగాల కల్పన పై.. మంత్రి కేటీఆర్ అంకెల గారడీతో ప్రజలకు లేఖ విడుదల చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిరుద్యోగ భృతిపై గ్రామాలకు వచ్చే టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభకు బీజేపీ చీఫ్ బండి సంజయ్, నిజామాబాద్ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత మల్యాద్రి రెడ్డి.. బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మల్యాద్రి రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరారు. తొలిసారిగా బాన్సువాడకు వచ్చిన బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ కు బాన్సువాడ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసం మంత్రి కేటీఆర్ లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలంగాణ ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పిన సీఎంను, ఆ పార్టీ నాయకులను గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని, ఒక్కో నిరుద్యోగికి టీఆర్ఎస్ ప్రభుత్వం 72వేలు భాకీ ఉందని గుర్తు చేశారు. 

పోడు భూములపై.. వారంలో సర్క్యులర్ ఇస్తామన్నన  కేసీఆర్ హామి ఏమైందని గుర్తు చేశారు బండి సంజయ్.. గిరిజనుల భూముల కోసం బీజేపీ పోరాడుతుంటే అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములను టీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి.. రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసుల లాఠీల కోసం బడ్జెట్ లో ప్రత్యేక నిధి పెట్టినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నయిం డైరీ ఆధారంగా తెలంగాణలో కేసీఆర్ పాలన నడుస్తుందని విమర్శించారు.