తెలంగాణ బిడ్డలపై మీ మమకారం ఏది..?

తెలంగాణ బిడ్డలపై మీ మమకారం ఏది..?

తెలంగాణ బిడ్డలపై మీ మమకారం ఏది..? అంటూ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావును ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్.. నియామక పత్రాలు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షకి దిగిన టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంఘీభావం తెలిపిన ఆయన...  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన యువతకు ఈ ప్రభుత్వం మొండిచేయి చూపిందని మండిపడ్డారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలపై నడుచుకుంటూ వచ్చిన కేసీఆర్.. విద్యార్థులను కనీసం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ ఏడాది డీఎస్సీ నియమాకాలు జరిగేవి... కానీ, తెలంగాణలో ఇప్పటికీ ఒక్క టీచర్ నియామకం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా ఆంధ్ర విద్యాసంస్థలకు సీఎం కేసీఆర్ కొమ్ము కాస్తోన్నరని విమర్శించిన లక్ష్మణ్.. కేజీ టూ పీజీ విద్య ఏమైంది? అని ప్రశ్నించారు. 2012 తర్వాత ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేదు.. ఏ నోటిఫికేషన్ వచ్చినా కోర్టుల చుట్టూ తిరగడమే.. ఉద్యోగాల కోసం విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోందని ఫైర్ అయ్యారు. పోస్టులిస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని బయపడుతున్నారని ఎద్దేవా చేసిన లక్ష్మణ్.. టీచర్లుగా పాఠాలు చెప్పాల్సినవాళ్లు రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.