కమలానికి కనక వర్షం... విరాళాలకు కంపెనీల క్యూ...

కమలానికి కనక వర్షం... విరాళాలకు కంపెనీల క్యూ...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారిక బీజేపీ పార్టీకి విరాళాల రూపంలో కనక వర్షం కురుస్తోంది. వివిధ ఎలక్ట్రోరల్‌ ట్రస్ట్‌లు ఇప్పటికే నిధుల వితరణ ప్రారంభించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రూడెంట్‌ ఎలక్ర్టోల్‌ ట్రస్ట్‌ (గతంలో సత్య ఎలక్ర్టోరల్‌ ట్రస్ట్‌)  భారీగా విరాళాలు ఇచ్చింది. వివిధ కంపెనీలు ట్రస్ట్‌కు రూ. 169 కోట్లు ఇవ్వగా.. ఇందులో ఏకంగా 90 శాతం మొత్తం బీజేపీకి విరాళంగా ఇచ్చింది ప్రూడెంట్‌ ఎలక్ట్రోరల్‌ ట్రస్ట్‌. ఈ ట్రస్ట్‌కు భారీగా నిధులు ఇచ్చిన కంపెనీల్లో డీఎల్‌ఎఫ్‌ ప్రథమస్థానంలో ఉంది. ఈ కంపెనీ ట్రస్ట్‌కు రూ. 52 కోట్లు ఇవ్వగా, రూ.33 కోట్లతో భారతీ గ్రూప్‌ రెండో స్థానంలో నిలిచింది. ష్రాఫ్ గ్రూప్‌ కంపెనీ యూపీఎల్‌ రూ. 22 కోట్లు ఇవ్వగా, గుజరాత్‌కు చెందిన టొరెంట్‌ గ్రూప్‌ రూ. 20 కోట్లు, డీసీఎం శ్రీరామ్‌ రూ. 13 కోట్లు, క్యాడిలా కంపెనీ రూ. 10 కోట్లు ఇవ్వగా... హాల్దియా ఎనర్జి రూ., 8 కోట్లు ఇచ్చినట్లు ట్రస్ట్‌ విరాళాల నివేదిక వెల్లడించింది. మొత్తం నిధుల్లో 90 శాతం బీజేపీకి ఇవ్వగా.. మిగిలిన మొత్తంలో రూ. 10 కోట్లు కాంగ్రెస్‌, రూ. 5 కోట్లు ఒడిషాకు చెందిన బిజూ జనతాదళ్‌కు ఇచ్చింది ఈ ట్రస్ట్‌. గతంలో ఈ ట్రస్ట్‌ అకాలీ దళ్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు రాష్ట్రీయ లోకదళ్‌కు భారీగా విరాళాలు ఇచ్చేది. 2017-18 మధ్యకాలంలో 18 విడతలుగా బీజేపీకి ఈ ట్రస్ట్‌ రూ. 144 కోట్లు చెల్లించింది.
ఇతర ట్రస్ట్‌లు...
ప్రూడెంట్‌ మాదిరిగానే ఇతర ట్రస్ట్‌లు కూడా తమ విరాళాల్లో భారీ మొత్తం బీజేపీకే ఇచ్చాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఏబీ జనరల్‌ ఎలక్ర్టోరల్‌ ట్రస్ట్‌ 2017-18లో రూ. 21 కోట్లు వివిధ పార్టీలకు విరాళంగా ఇవ్వగా.. ఇందులో రూ. 12.5 కోట్లు బీజేపీకి ఇవ్వగా... కాంగ్రెస్‌కు కేవలం ఒక కోటి మాత్రమే ఇచ్చింది. మరో రూ.8 కోట్లు ఈ కంపెనీ బీజేడీకి ఇవ్వడం గమనార్హం. మురుగప్పా గ్రూప్‌ మద్దతు ఉన్న ట్రింఫ్‌ ఎలక్ట్రోరల్‌ ట్రస్ట్‌ మాత్రం బీజేపీకి కోటి రూపాయలు ఇవ్వగా... కాంగ్రెస్‌కు 2 కోట్లు ఇచ్చినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించిది.