బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుంది

బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుంది

గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి అత్యధిక సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలిపారు. మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. మోడీ, అమిత్ షా కాంబినేషన్ లో బీజేపీ ఎన్నికల నిర్వహణలో మరింత పదును తేలిందన్నారు.  జాతీయత, అభివృద్ధి, సంక్షేమ పరిపాలన మోడీ త్రిశూల విధానమని పేర్కొన్నారు. కులాలకు అతీతంగా మోడీ కి జనం బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. పగద్బందీ వ్యూహంతో, ఎంతో దూకుడుగా దేశంలో ఇంతవరకు ఎవరూ వ్యవహరించలేదన్నారు. 2014 నుంచి వరుసగా అనేక రాష్ట్రాలలో విజయం సాధించడం సాధారణ విషయం కాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఉన్న వ్యతిరేకత శూన్యతను బీజేపీ పూరిస్తుందని తెలిపారు. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 5 స్థానాల్లో బీజేపీ గట్టి పోటీనిచ్చిందని స్పష్టం చేశారు. 

'దేశంలో మోడీ వ్యతిరేకత ఎక్కడా లేదు. మోడీ మంత్రం దేశం అంతా బాగా పనిచేస్తుంది. ప్రతి దశలోనూ బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతుంది. గతం కంటే ఎక్కువ స్థానాలతో మెజారిటీ సాధిస్తాం. ఉత్తర ప్రదేశ్ లో బీఎస్పీ, ఎస్పీ కూటమి లోని అసమ్మతి వాదులు, కర్నాటకలో కాంగ్రెస్,  జేడీఎస్ కూటమి వ్యతరేకులు బీజేపీకి సహకరిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో జరిగే నష్టాన్ని తమిళనాడు తో భర్తీ చేస్తాం.  సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ ఇంట్లో కూర్చోబెట్టడం ద్వారా కర్ణాటకలో బీజేపీకి బాగా లబ్ధి కలిగింది. సిద్ధరామయ్య అనుచరులు బీజేపీలో చేరారు. కూటమి వల్ల తమ ఉనికికి నష్టం వాటిల్లుతున్నా నేతలంతా బీజేపీ లో చేరుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారు అని ప్రముఖ సర్వే సంస్థలు చెబుతున్నాయి. వైసీపీకి 110 సీట్లు వస్తాయి. చంద్రబాబు మైక్రో మేనేజ్ మెంట్ వల్ల కనీసం పోటీలో నిలబడగలిగారు. చంద్రబాబుకు ఎన్డీఏ  ద్వారాలు శాశ్వతంగా మూసివేశామని అమిత్ షా బహిరంగంగా  ప్రకటించారు. చంద్రబాబును తిరిగి ఎన్డీఏలోకి తీసుకునే అవకాశమే లేదు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు' అని మురళీధర్ పేర్కొన్నారు.