బీజేపీ నేత ముకుల్ రాయ్ పై ఎఫ్ఐఆర్

బీజేపీ నేత ముకుల్ రాయ్ పై ఎఫ్ఐఆర్

పశ్చిమ బెంగాల్ లోని నాదియా జిల్లాలో టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య కేసులో ఆదివారం బీజేపీ నేత ముకుల్ రాయ్ సహా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రాథమిక రిపోర్ట్ లో పేర్లున్న నలుగురిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. బెంగాల్ రాజకీయాల్లో ముకుల్ రాయ్ సుప్రసిద్ధుడు. గత ఏడాదే ఆయన టీఎంసీని వదిలిపెట్టి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఒకానొకప్పుడు ఆయన సీఎం మమత బెనర్జీ అత్యంత సన్నిహితులలో ఒకరిగా ఉన్నారు. ఇప్పుడు వారిద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. 

పశ్చిమ బెంగాల్ నాదియాలో ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య ఆరోపణలను బీజేపీ నేత ముకుల్ రాయ్ ఖండించారు. ఇవన్నీ అసత్య ప్రచారాలని కొట్టేశారు. బెంగాల్ ఎక్కడైనా టీఎంసీ కార్యకర్తలను హత్య చేస్తే దానికి బీజేపీ కార్యకర్తలు, నేతలే కారణమని ఆరోపిస్తారని చెప్పారు. బీజేపీ ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించదన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సత్యజిత్ బిశ్వాస్ ను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపినట్టు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ స్పష్టంగా పేర్కొందని పోలీస్ అధికారులు తెలిపారు.