ఐపీఎల్‌ ఫైనల్‌: జోరుగా బ్లాక్ టికెట్ల దందా...

ఐపీఎల్‌ ఫైనల్‌: జోరుగా బ్లాక్ టికెట్ల దందా...

హైదరాబాద్‌లోని ఉప్పల్.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం కుర్రకారు ఎగబడుతున్నారు. ఓవైపు ఎండను సైతం లెక్కచేయకుండా జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఎలాగైనా ఫైనల్ మ్యాచ్‌ చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతుంటే... దీనిని క్యాష్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేటు గాళ్లు... బ్లాక్ టికెట్ల దందాకు తెరతీశారు. దాదాపు 36 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు ఆన్‌లైన్‌ల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు.. జింఖానా గ్రౌండ్స్‌కు వచ్చి టికెట్లు తీసుకోవడానికి దాదాపు ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు సైట్‌లో సోల్డ్ ఔట్ దర్శనమిస్తుండగా... బ్లాక్‌లో టికెట్ల దందా జోరుగా సాగుతోంది. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియం చుట్టూ క్రికెట్ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతుండగా... గేట్ల ముందు బ్లాక్ టికెట్లను విక్రయిస్తున్నారు. రూ. 2 వేల టికెట్లను బ్లాక్‌లో రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.