ఇంకా తెలియని ఏడుగురు ఆచూకీ..

ఇంకా తెలియని ఏడుగురు ఆచూకీ..

బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం పశువుల్లంక  రేవులో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో భారీ వర్షం కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం యానాం రాజివ్ గాంధి బీచ్ వద్ద నుంచి ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ ను అమలాపురం ఆర్డీఓ బివి రమణ, డిఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షిస్తున్నారు. పశువుల్లంక రేవుకు చేరుకున్న సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టాయి. నిన్న సాయంత్రం గోదావరినదిలో జరిగిన ఘోర పడవ ప్రమాద సమయంలో 31మంది ప్రయాణీకులు...10మోటార్ సైకిళ్ళు రవాణాలో ఉన్నాయి. పశువుల్లంక రేవులో సలాదివారిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.  

నిర్మాణంలో ఉన్న వంతెన స్తంభాన్ని ఢీకొట్టి నాటుపడవ బోల్తాపడింది. ఇంజన్ మెరాయించడం, ప్రతికూల వాతావరణం, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పడవబోల్తా పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఆరుగురు విద్యార్ధినులతో సహా గృహిణి గల్లంతైన వారిలో ఉన్నారు. 8కిలోమీటర్ల గోదావరిలో కొట్టుకుపోయి నాటుపడవ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. పరిమితికి మించి బరువు వేయడం వల్లే ప్రమాదం జరిగిందంటూ వాపోతున్నారు స్థానికులు. తమ పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు రాత్ర నుంచి గోదావరి వద్దే రోదిస్తున్నారు.