స్వస్థలాలకు చేరుకున్న జవానుల మృతదేహాలు

 స్వస్థలాలకు చేరుకున్న జవానుల మృతదేహాలు

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలుకోల్పోయిన వీరజవాన్ల మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకుంటున్నాయి. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను చూసి... కుటుంబసభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు. చెక్కబాక్సుల్లో త్రివర్ణ పతాకం కింద అమరులై రావడం చూసి... భరించలేక గుండెలు పగిలేలా విలపిస్తున్నారు వారి కుటుంబసభ్యులు. ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు తమిళ జవానుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఉగ్రదాడిలో చనిపోయిన శివచంద్రన్‌ స్వగ్రామం కారైకుడికి, మరో జవాను స్వగ్రామం తూత్తుకుడికి ప్రత్యేక మిలటరీ వాహనాల్లో తరలించారు. ముందుగా తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న జవానుల మృతదేహాలకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘననివాళులు అర్పించారు. అక్కడి నుంచి అధికార లాంఛనాలతో ఖననం చేసేందుకు జవానుల గ్రామాలకు తరలించారు. తిరుచ్చి నుంచి రెండు మార్గాల ద్వారా బయలుదేరిన జవానుల భౌతికకాయాలకు దారిపొడవునా ప్రజలు అశ్రునివాళులు అర్పించారు. అధికారులు, మంత్రులతో పాటు ప్రజలు గౌరవ సూచకంగా అంతిమ యాత్రలో పాల్గొనడంలో రోడ్లు స్తంభించిపోయాయి. 

పుల్వామా దారుణఘటనతో యావత్ భారత దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. పాకిస్థాన్ ఉగ్రోన్మాదంపై కోపం కట్టలు తెంచుకుంటోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. దాయాదీ దేశంపై ప్రతికారం తీర్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా దాడికి నిరసనగా కశ్మీరం రగలుతోంది. జమ్మూ, శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో బంద్ పాటిస్తున్నారు ప్రజలు. బంద్ సందర్భంగా జమ్మూలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.