అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్

మంచు తుఫాన్ అమెరికాను వణికిస్తుంది. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. స్కూళ్లు, వ్యాపారాలు మూతబడ్డాయి. ఇక కొన్ని చోట్ల హిమపాతంతో పాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకట్లో ఉన్నాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును ‘బాంబ్‌ తుఫాన్’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే కూడా అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.