నేడే బోనాల పండుగకు శ్రీకారం.. 

నేడే బోనాల పండుగకు శ్రీకారం.. 

ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో గ్రామ దేవతలను పూజించే బోనాల పండుగ సంబురాలు ఈరోజు ప్రారంభంకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట వేదికగా ప్రారంభమయ్యే ఈ సంబురాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా గోల్కొండ కోటలో కొలువైన జగదాంబికా అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో రానున్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచే అమ్మవారి ఆలయానికి దారితీసే మెట్లను భక్తులు పసుపు, కుంకుమలతో అలంకరించారు.    

తెలంగాణ సంప్రదాయానికి నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగ సంబురాలు గోల్కొండ కోటనుంచే ఈరోజు ప్రారంభమౌతాయి. ఇక్కడ ప్రారంభమైన తర్వాతనే తెలంగాణ వ్యాప్తంగా బోనాల వేడుకలు నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో.. ఎంతో వైభవంగా నెల రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలు ప్రారంభోత్సవానికి లంగర్ హౌస్ వేదిక కానుంది. ఈ వేడుకలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, మంత్రులు నాయిని నరసింహీరెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు ఈరోజు ప్రారంభిస్తారు. లంగర్ హౌస్ చౌరస్తాలో ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అమ్మవారి తొట్టెల, పలహారం బండికి ఉపముఖ్యమంత్రి, మంత్రులు పూజలు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం తలఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, కల్లుసాక సమర్పించనున్నారు.