ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై బోణీ కపూర్ అసహనం

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై బోణీ కపూర్ అసహనం

రాజమౌళి నూతన చిత్రం ఆర్ఆర్ఆర్‌ను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ అసహనం వ్యక్తం చేశారు. టాలీవుడ్ పరిశ్రమకు ఇతర పరిశ్రమల పట్లు సోదరభావం అనేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి నిర్ణయం పూర్తిగా అనైతికంగా ఉందని అన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా బోణీ కపూర్ దర్శకధీరుడు సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై ఇలా ఎందుకు స్పందించాడని కొందరికీ అర్థం కాలేదు. అయితే బాహుబలి సినిమాతో రాజమౌళికి జాతీయ స్థాయిలో స్టార్ దర్శకుడిగా గొప్ప పేరు వచ్చింది. దాని తరువాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అందులోనూ ఈ సినిమా తెలుగు నాట ఉన్న ఇద్దరు అగ్రహీరోలు యంగ్‌టైగర్ ఎన్‌టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరికీ హిందీలో కూడా మార్కెట్ ఉంది. అయితే అదే తేదీకి అంటే అక్టోబరు13కి బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ సినిమా విడుదల కానుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుట్‌బాల్ లెజెండ్ అబ్దుల్ రహిం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడంతో బోణీ కపూర్ ఈ విధంగా స్పందించాడు. ఈ రెండు సినిమాల క్లాష్ వల్ల రెండు సినిమాలు భారీ ఎత్తున ఇబ్బందులకు గురవుతాయని, నష్టాల బారిన పడే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయని బోణీ అన్నారు.