మట్టిని మనిషిగా చేసిన పుస్తకపఠనం

మట్టిని మనిషిగా చేసిన పుస్తకపఠనం

Images: CNN

చేయని తప్పుకు బాల నేరస్తుడిగా జైలుకెళ్లి.. నా అన్నవాళ్లకు దూరంగా 27 ఏళ్లు శిక్ష అనుభవించి.. ఆ శిక్షా కాలంలోనే అద్భుతమైన వ్యక్తిత్వాన్ని సముపార్జించుకొని.. పది మందికీ సాయపడుతున్న ఆ రెండు చేతుల పేరే జాన్ బన్. మనిషి ఆలోచనలే మనిషిని తీర్చిదిద్దుతాయని, అవే మనిషిని జీవితాంతం నడిపిస్తాయి అనడానికి 41 ఏళ్ల బన్ జీవితమే ఓ ఉదాహరణ. 

వివరాల్లోకి వెళ్దాం పదండి..
అమెరికాలోని బ్రూక్రిన్లో కింగ్స్ బారోలో ఉండే ఓ అపార్టుమెంట్లో 14 ఏళ్ల జాన్ బన్.. తల్లి, రెండేళ్ల సోదరితో ఉంటున్నారు. బరువు బాధ్యతల్లేని 14 ఏళ్ల బన్.. తన ప్రమేయ లేకుండానే ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో 27 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 1991 ఆగస్టు 14 తెల్లవారుజామున వారి అపార్టుమెంట్ సమీపంలోనే ఓమర్డర్ జరిగింది. రైకర్స్ ఐలాండ్ కరెక్షన్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్న రోలాండో నీచర్, రాబర్ట్ క్రాసన్ ప్రయాణిస్తున్న కారుని దుండగులు ఆపారు. వారిని కారులోంచి దిగమని, తుపాకీ గురిపెట్టి డబ్బులు తీయమన్నారు. ప్రశ్నించబోతే కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దుండగులు కారెక్కి పారిపోగా.. కాల్పుల్లో రోలాండో నీచర్ కు తీవ్రగాయాలయ్యాయి. 3 రోజుల తరువాత రోలాండో చనిపోయాడు. ఈ ఘటనే బన్ జీవితంతో ఆడుకొని.. ఆయన్ని అసలైన ఆటగాడిగా మార్చేసింది.  

మరుసటి రోజే విచారణ మొదలైంది. హంతకుల్ని పట్టుకునేందుకు డిటెక్టివ్ సార్సెలా రంగంలోకి దిగాడు. 14 ఏళ్ల జాన్ బన్ తో పాటు మరో 17 ఏళ్ల హర్ గ్రేవ్ అనే మైనర్ అబ్బాయిని కూడా విచారణకు తరలించారు. బన్ కు 20 ఏళ్ల నుంచి జీవితకాల శక్షి విధించారు. ఆ తీర్పుతో తల్లికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చేర్పించారు. అలా ఏ ఆధారమూ లేకుండానే ఆగస్టు 17న బన్ ని జువెనైల్ కరెక్షన్ సెంటర్ కి తరలించారు. తనకే పాపమూ తెలియదని ఎంత చెప్పినా వినేవారు ఎవరూ లేరు. అప్పటికి బన్ కి ఆడుకోవడం తప్ప చదవడం, రాయడం, అసలు చదువుకోవాలన్న ఆలోచనే ఉండేది కాదు. అలాంటి టైమ్ లో శిక్ష అనుభవిస్తున్న బన్ కి.. తల్లితో మాట్లాడాలని ఎంతో ఆరాటపడేవాడు. కానీ సెంటర్ నిర్వాహకులు అనుమతించేవారు కాదు. తను ఎంతో ప్రేమించే తల్లితో మాట్లాడనివ్వకపోవడమే బన్ భావాలకు పదునుపెట్టింది. సెంటర్లో జరిగే విషయాలు, ఎదురైన అనుభవాలు, అధికారుల వేధింపుల గురించి తల్లికి ఏమేం చెప్పాలనుకున్నాడో.. అవి చెప్పే అవకాశం సెంటర్ నిర్వాహకులు కల్పించలేదు. దీంతో ఇక చదువే ఏకైక మార్గమన్న బలమైన అభిప్రాయానికొచ్చాడు. అప్పటికి బన్ కు ఏ,బీ,సీ,డీ లు కూడా రావు. అయితే చదవాలన్న పట్టుదల కారణంగా జువెనైల్ సెంటర్లో ఉండే పిల్లల పుస్తకాలు, డిక్షనరీలు, అక్కడ ఉండే పెద్దవాళ్ల సాయం తీసుకొని చదవడం, రాయడం, సరిగా పలకడం లాంటివి బాగా ప్రాక్టీస్ చేశాడు. జైలుకెళ్లిన రెండేళ్లలో ఈ పని పూర్తి చేశాడు. జువెనైల్ సెంటర్లో బన్ చదవని పుస్తకం లేదు. ఒక్కో పుస్తకం తన వ్యక్తిత్వంలోని ఒక్కో పార్శ్వాలను తీర్చిదిద్దిందని చెబుతాడు. ఇక 17 ఏళ్లు వచ్చేటప్పటికే జీఈడీ పూర్తి శాడు.  దీంతో ఆయన్ని స్టేట్ హోమ్ కు తరలిస్తూ అప్ గ్రేడ్ చేశారు. రాయగలగడం, చదవగలగడమే తనలో ఆత్మవిశ్వాసం నింపిందని, ఊహాశక్తి పెరుగుదలకు అదే కారణమని బన్ ఎంతో గర్వంగా ఫీలవుతాడు. 

 

స్టేట్ హోమ్ కు తరలించేటప్పుడే ఆయనకు అక్కడుండే కరుడుగట్టిన నేరగాళ్ల గురించి తెలిసింది. రేపిస్టులు, గుండాలు కొలువై ఉండే ప్రదేశమని తెలియడంతో.. తానింకా అగ్రెసివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా న్యూయార్క్ ఎల్మీరా కరెక్షనల్ ఫెసిలిటీ సెంటర్లో కోపాన్ని అదుపులో ఉంచుకోవడంలో ఎంతో సాధన చేసి సక్సెస్ అయ్యాడు. అలాగే సహ ఖైదీలకు కౌన్సెలర్ గా పనిచేసేందుకు సర్టిఫై కూడా అయ్యాడు. దీంతో మిగతా ఖైదీలకన్నా ప్రత్యేకమైన వ్యక్తిగా తయారయ్యాడు.. బన్. ఇక్కడే అతను పూర్తిగా మలచబడ్డాడని చెప్పాలి. సత్ప్రవర్తన కారణంగా 2006లో బన్ కు పెరోల్ మంజూరైంది. 17 ఏళ్ల తరువాత తొలిసారిగా బయటి ప్రపంచాన్ని చూశాడు బన్. తల్లి, సోదరిని చూసేసరికి తాను ఇక పూర్తి సురక్షితుడిని అన్న ఫీలింగ్ కలిగింది. కానీ బయటి ప్రపంచం మరోలా ఉంది. మర్డరర్ అన్న ముద్ర ఉండడంతో బయట ఎక్కడా ఉద్యోగాలు రాలేదు. ఎవరూ ఆదరించలేదు. దీంతో డిప్రెషన్ కు గురయ్యాడు. అటు పెరోల్ మీటింగ్స్ కు ఒకసారి మిస్సవడంతో.. మళ్లీ జైలుకు పంపించారు. ఏడాది జైల్లో గడిపాక 2009లో బెయిల్ పై విడుదలయ్యాడు. బెయిల్ మీద ఉండగానే.. ట్రయల్స్ కు అటెండవుతూ తాను ఏ తప్పూ చేయలేదంటూ పోరాడుతూ ఉన్నాడు. దీనికోసం తల్లికి ఉన్న కొద్దిపాటి సంపాదనంతా ధారవోసింది. ఈలోగా 2010 తప్పుడు అభియోగాలతో శిక్ష పడ్డ బాధితుల పక్షాన పోరాడేందుకు ఓ ఎన్జీవో సంస్థ బన్ కోసం ముందుకొచ్చింది. వారి కృషి కారణంగా బన్ తో పాటు హర్ గ్రేవ్ కూడా విడుదలయ్యారు. ఆనాటి మర్డర్లో వీరి పాత్రేమీ లేదని కోర్టు నిర్ధారించింది. కానీ పోయిన కాలానికి, నష్టపోయిన జీవితానికి పరిహారంగా తిరిగి ఏమీ రాలేదు. అటు డిటెక్టివ్ మీద కూడా ఎలాంటి చర్యలూ కోర్టు తీసుకోలేదు. అంతేకాదు.. 80, 90 దశకాల్లో సార్సెలా విచారించిన అనేక కేసులను కోర్టు తిరగదోడుతోంది. ఆయన ఫైల్ చేసిన చార్జిషీట్లో తప్పుడు అభియోగాలు నమోదైనట్టు కోర్టు తేల్చినవారిలో బన్, హర్ గ్రేవ్ 12, 13 వ వ్యక్తులు.. అయినా సార్సెలా మాత్రం తను పూర్తి ఆధారాలతోనే పని చేశానని చెప్పుకోవడం విశేషం. 

పూర్తిగా కొత్త మనిషి..
ఇక జాన్ బన్ ని కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడు ఆయన ఆనందానికి అవధుల్లేవు. తానెప్పుడూ ఏ తప్పూ చేయలేదని, శిక్ష మాత్రం అనుభవించానని కోర్టులో జడ్జి ముందు మాట్లాడిన మాటలతో జడ్జి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. ఆ తరువాత బన్ ఆపరేషన్ మాత్రం ఆగలేదు. ఎ వాయిస్ ఫర్ ద అన్హర్డ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. చదువు లేనివారికి, చదువుకోలేనివారికి, ఖైదీల ఉపయోగార్థం పుస్తకాలు సేకరించి ఇవ్వడాన్ని పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటివరకు 20 వేల పుస్తకాలు ఇచ్చాడు. అంతేకాదు.. బ్రూక్లిన్ లోని ఎంబర్ చార్టర్ స్కూల్లో ప్రతిరోజూ పిల్లలకు పాఠాలు చెబుతాడు. కౌన్సెలింగ్ ఇస్తాడు. అవి మామూలు పాఠాలు కాదు. జీవిత పాఠాలు. మీ అందరికీ నేనున్నానని, మనమంతా ఒక్కటని.. పసిపిల్లల్లో ధైర్యం, వికాసం నూరిపోస్తాడు. బన్ చెప్పే మాటలకు పిల్లలంతా రోజూ ఎంతో ఉత్తేజితం అవుతుంటారు. పాఠాలు పూర్తయ్యాక సామూహిక ఆలింగనం వారి దినచర్యలో భాగం.