ఉద్యోగులు అధైర్య పడాల్సి అవసరం లేదు !

ఉద్యోగులు అధైర్య పడాల్సి అవసరం లేదు !

గ్రామ‌ స్వరాజ్యానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, గ్రామాభివృద్ధికి పాలకవర్గం పని చేయాలంటే ఏకగ్రీవం కావాలని ఆయన అన్నారు. కులాలతో గ్రామాలను విభజించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న స్ఫూర్తిని, ప్రజలందరూ స్వాగతించాలని అన్నారు. ప్రలోభాలకు పోకుండా, విబేధాలకు తావు లేకుండా, ఐక్యతతో, శాంతి యుతంగా ఎన్నికలు జరిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. పేదవాడికి సహాయం అందకూడదని, ప్రభుత్వ కార్యక్రమాలను టీడీపీ తూట్లు పొడుస్తోందని అన్నారు.

గ్రామీణ వాతావరణం కలుషితం కాకుండా ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఏకగ్రీవాలపై దృష్టి పెడతాను అనడం బాగోలేదన్న ఆయన ఎక్కడా సందిగ్ధత ఉండకూడదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహిస్తూ, ఎన్నికలకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఉంటామని ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలో చెప్పాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో.. ఉద్యోగులెవరూ అధైర్యపడద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎస్ఈసీ ఇప్పుడు తీసుకుని నిర్ణయాలు ఎన్నికలు అయిన తర్వాత రివోక్ చేస్తామని ఉద్యోగులు అధైర్య పడాల్సి అవసరం లేదని అన్నారు. నిమ్మగడ్డ ఒక పార్టీ కోసం పని చేస్తున్నారని అన్నారు. దురుద్ధేశ పూర్వకంగా ఉద్యోగుల పై తీసుకునే చర్యలను ఎన్నికలు అయిన తర్వాత సరి చేస్తామని అన్నారు. ఉద్యోగుల ఆత్మ స్థైర్యాన్ని ఈ ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు.