కోడెల బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారా? 

కోడెల బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారా? 

ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మానసిక ఒత్తిడుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కోడెలపై కావాలనే ప్రభుత్వం కేసులు పెట్టి ఆయన్ను మానసికంగా హింసించిందని, కోడెల మరణానికి ప్రభుత్వమే కారణమని చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే.  దీనిపై ఏపీ మంత్రి బొత్సా సత్యన్నారాయణ స్పందించారు.  

కోడెలపై ఫిర్యాదు చేసింది టిడిపి నాయకులే అని, కోడెల చనిపోయారని సానుభూతి లేకుండా రాజకీయాలు చేస్తున్నారని బొత్సా మండిపడ్డారు.  రాష్ట్రంలోకి సిబిఐ రావొద్దన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అనడంలో అర్ధం లేదని చెప్పారు.  బాబు ఐదేళ్ల పాలనలో చేసిన మంచి పని ఒక్కటికూడా లేదని అన్నారు.  గతంలో గవర్నర్ల వ్యవస్థ బాగాలేదని బాబు అన్నారని, ఇప్పుడు బాబు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ ను కలిశారని బొత్స విమర్శించారు.  కోడెల బీజేపీలో చేరేందుకు ఎందుకు ప్రయత్నించారో బాబుకు తెలియదా అని బొత్సా ప్రశ్నించారు.