తెలుగుదేశం శకం ముగిసింది

తెలుగుదేశం శకం ముగిసింది

తెలుగుదేశం శకం ఇక ముగిసిందని, వచ్చేది రాజన్న రాజ్యమేనని వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిరోజుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మంచి సంక్షేమ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీని జనం పరిగెత్తించేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కుట్రలు ఆపకుంటే ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు. చంద్రబాబుకు మాత్రం ఇంకా అధికారం మీద, సీఎం కుర్చీ మీద యావ తగ్గలేదని ఎద్దేవా చేశారు. ఇదే ధోరణి ఫలితాల తర్వాత కూడా ఉంటే ప్రమాదమన్నారు. 

"చంద్రబాబు రాష్ట్రానికి ఉపయోగపడే సమీక్షలు జరపడం లేదు. అవినీతి కార్యక్రమాలను చక్కబెట్టే పనిలో ఉన్నారు. పాత బకాయిల కోసమే సీఎం సమీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానాలు వస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడే అందరూ ఉండాలి, అందుకు ఎవరూ అతీతులు కాదు. ఆయనకు ప్రజాస్వామ్యం అంటే అంత తమాషాగా ఉందా? న్యాయం, ధర్మానిదే అంతిమ విజయం. ఎన్నికలనోటిఫికేషన్‌ వెలువడ్డ తర్వాత చంద్రబాబు 18 కాన్ఫిడెన్షియల్‌ జీవోలు జారీ చేశారు. అన్ని త్వరలోనే బయటకు వస్తాయి. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆనాడే చెప్పాం. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు ముందుంటారు. పోలీస్‌ వ్యవస్థను కూడా ఆయన భ్రష్టు పట్టించారు. ఇంటెలిజెన్స్‌ శాఖ ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేసింది. ఏడాదిగా నా ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉంది. కాదని చెప్పమనండి?. ఎన్నికల సంఘం కూడా తన మాట వినాలని చంద్రబాబు అనుకోవటం అవివేకం" అని అన్నారు.