అవసరమైతే టీడీపీ వాళ్లకూ టెస్టులు చేస్తాం : బొత్స

అవసరమైతే టీడీపీ వాళ్లకూ టెస్టులు చేస్తాం : బొత్స


కరోనా టెస్టుల విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్న ఆయన ప్రతి రోజూ సమీక్షలు జరుపుతూ నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన ఏపీ మొత్తం 58 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. వ్యాప్తికి కారణలేమైనా ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటోందని అన్నారు. సీఎం పిలుపునిచ్చినట్టుగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆయన అన్నారు. ఢిల్లీలోని ప్రార్ధన మందిరానికి వెళ్లిన వారికి ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్న బొత్స వేరే కోణంలో ఆలోచించకుండా ఆ ప్రార్ధనా మందిరానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛంధంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. పూర్తి స్థాయిలో ఆరోగ్య సర్వే చేయిస్తున్నామన్న బొత్స ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లకు ప్రజలు సహకరించాలని అన్నారు.

నిత్యావసర వస్తువుల కోసం ఇచ్చిన వెసులుబాటు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులను ఆదుకుంటామని ఆయన అన్నారు. రోజూ వారీ కూలీలు, నిరాశ్రయులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులందరితో నిత్యం సమీక్షిస్తున్నామని ఆరోగ్య శాఖకు కావాల్సిన నిధులను విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే 2వేల బెడ్లను సిద్దం చేశామని అలాగే ఐసీయూలను ఏర్పాటు చేస్తున్నామని బొత్స అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం అలసత్వంతో ఉందనే రీతిలో చంద్రబాబు కామెంట్లు చేశారని, చేసింది చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదని అన్నారు. ప్రచారం చేసుకునే విషయంలో మేం అలసత్వం వహించి ఉండొచ్చని ఆయన అన్నారు. అవసరమైతే టీడీపీ వాళ్లకూ టెస్టులు చేస్తామని హైదరాబాదులో కూర్చొని విమర్శలు చేయడం తగదని బొత్స అన్నారు.