హైదరాబాద్ మెట్రో.. అందుబాటులోకి అద్దె బైకులు..

హైదరాబాద్ మెట్రో.. అందుబాటులోకి అద్దె బైకులు..

హైదరాబాద్ మెట్రో రోజురోజుకు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది. మెట్రో దిగిన తర్వాత గమ్యస్థానానికి చేరుకోవడం ఎలా? అనే ఆందోళన చెందాల్సిన పనిలేకుండా... ఏ ఆటో కోసమో..? క్యాబ్ కోసమో? ఆర్టీసీ బస్సు కోసమో? ఎవరో లిఫ్ట్ ఇస్తారని ఎదురుచూడాల్సిన పనిలేకుండా.. వెంటనే బైక్ తీసుకొని గమ్యస్థానానికి వెళ్లొచ్చు.. ఇప్పటికే బెంగళూరు లాంటి నగరాల్లో ఇలాంటి సేవలు అందిస్తున్న బౌన్స్ సంస్థ.. హైదరాబాద్‌లో కూడా అద్దె బైకు సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇప్పుడు మొదట.. సికింద్రాబాద్ ప్యారడైజ్ మెట్రో స్టేషన్లలో ప్రారంభమైన ఈ సేవలను.. హైటెక్ సిటీ, జూబ్లీ చెక్‌పోస్టు, సీబీఎస్.. ఇలా దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లకు విస్తరించేలా చర్యలు తీసుకుంటుంది. 

మీకు డ్రైవింగ్ లైసెన్సు ఉండి.. మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీరు బౌన్స్ అద్దె బైకుల సేవలను ఉపయోగించుకోవచ్చు.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు బైక్ తీసుకుని.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. తిరిగి ఆ బైక్‌ను తీసుకున్న ప్రాంతానికి వెళ్లాల్సిన పనేలేదు.. మీ గమ్యస్థానంలోనే ఆ బైక్‌ను వదిలేయొచ్చు.. ఇక, తాళం వేయాల్సిన పనికూడా లేదు. మొబైల్ ఉన్న యాప్ ద్వారా మన ట్రిప్ ముగిసినట్లు తెలియజేస్తే చాలు. బౌన్స్ కంపెనీ ప్రతినిధులే ఆన్‌లైన్‌లో బైకును లాక్ చేస్తారు. ఇక ఆ ప్రదేశంలో మరొకరు అదే బైకును తీసుకొని తమ రైడ్‌ను ప్రారంభించవచ్చు. ఇలా సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయాన్ని కలిపిస్తోంది. ఈ సేవలను వినియోగించుకునే వారు ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.. ఇన్‌వెర్స్ టెక్నాలజీ సహాయంతో బౌన్స్ సంస్థ టీవీఎస్ జెస్ట్, టీవీఎస్ పెప్ మోటార్ బైకులను నడుపుతోంది. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తేనున్నారట. ఈ వాహనాలన్నీ కీ లెస్‌వే.. ఏ వాహనానికి తాళం ఉండవు. హెల్మెట్‌లతోసహా జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటాయి.