విక్రమ్ ల్యాండర్‌పై హాలీవుడ్ హీరో ఆరా..

విక్రమ్ ల్యాండర్‌పై హాలీవుడ్ హీరో ఆరా..

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇస్రోతో కలిసి... నాసా కూడా దీని కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రుడిపై విక్రమ్ దిగిన ప్రాంతానికి నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ వచ్చే చాన్స్ ఉంది. మరోవైపు... హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్‌ విక్రమ్ ల్యాండర్ గురించి వాకబు చేశారు. ల్యాండర్‌ను చూశారా అంటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న అమెరికా వ్యోమగామికి ఫోన్‌ చేసి అడిగారు. 

వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయానికి వచ్చిన బ్రాడ్‌పిట్‌ అక్కడి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడియో కాల్‌ చేశారు. వ్యోమగామి నిక్‌ హేగ్‌తో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. అంతరిక్షంలోని పరిస్థితుల గురించి బ్రాడ్‌ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. 'గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది, అక్కడ లైఫ్‌ ఎలా ఉంది' లాంటివి అడిగారు. వీటన్నింటిపైనా నిక్‌ హేగ్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌ -2 గురించి కూడా బ్రాడ్‌ పిట్‌ వ్యోమగామితో ప్రస్తావించారు. జాబిల్లిపై ల్యాండర్‌ విక్రమ్‌ను గుర్తించారా? అని అడగ్గా.. 'దురదృష్టవశాత్తు ఇంకా లేదు' అని నిక్‌ హేగ్‌ చెప్పారు. కాగా, బ్రాడ్‌పిట్‌ హీరోగా 'ఆడ్‌ ఆస్ట్రా' పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బ్రాడ్‌ వ్యోమగామి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నాసా కేంద్రానికి వెళ్లిన ఆయన.. వ్యోమగామి నిక్‌ హేగ్‌తో మాట్లాడారు. ఈ వీడియో కాల్‌ను నాసా టీవీలో ప్రసారం చేశారు. బ్రాడ్‌ వ్యోమగామితో మాట్లాడుతున్న వీడియోను నాసా ట్విటర్‌లోనూ షేర్‌ చేశారు.