క్వార్టర్స్‌లో బ్రెజిల్‌...

క్వార్టర్స్‌లో బ్రెజిల్‌...

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లన్నీ వరుసగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో మరో టైటిల్ ఫేవరేట్ జట్టు బ్రెజిల్‌ ప్రత్యర్థిని కట్టడి చేసి సునాయాసంగా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌ 2–0తో మెక్సికోపై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో మెక్సికో గోల్‌ పోస్టులపై తరచుగా దాడులు చేసింది. తొలి 25 నిమిషాల్లో మెక్సికో అద్భుత ఆటతో ఆకట్టుకున్నా.. గోల్ మాత్రం చేయలేకపోయింది. మరోవైపు బ్రెజిల్‌ జట్టు సాధారణంగా  కనిపించింది. కానీ మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ బ్రెజిల్‌ జోరు పెంచి.. డిఫెండర్లు మెక్సికో ఆటగాళ్లకు అవకాశమే ఇవ్వలేదు. మెక్సికోతో పోలిస్తే గోల్‌ను లక్ష్యంగా చేసుకుని బ్రెజిల్‌ ఆటగాళ్లు రెట్టింపు షాట్లు ఆడారు. కానీ ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ ఒచొవా అడ్డుకోవడంతో మొదటి అర్ధభాగంలో ఏ ఒక్కటీ గోల్‌ కాలేకపోయింది. దీంతో మొదటి భాగం 0-0తో ముగిసింది.

రెండో అర్ధభాగం మొదలైన 51 నిమిషంలో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్‌ గోల్ చేసాడు. పెనాల్టీ బాక్స్‌లో ఎడమవైపు నుంచి విలియన్‌ ఇచ్చిన పాస్‌ ను గోల్‌ పోస్టుకు చేరువగా ఉన్న నెయ్‌మార్‌.. బంతిని లోనికి పంపి బ్రెజిల్ కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం మెక్సికోకు బ్రెజిల్‌ ఆటగాళ్లను అడ్డుకోవడానికే సరిపోయింది. ఆట 86వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్‌ కౌటిన్హో  స్థానంలో వచ్చిన సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు ఫర్మినో గోల్‌ చేసి బ్రెజిల్‌ ను 2-0 ఆధిక్యంలోకి తెచ్చాడు. ఆట చివరికి కూడా మెక్సికో గోల్ చేయలేకపోయింది. ఇక ఇంజురీ టైంలో కూడా మెక్సికో ఆటగాళ్లు అద్భుతాలేమీ చేయకపోవడంతో మ్యాచ్‌ బ్రెజిల్‌ వశమైంది.