బోర్డర్ లో పాక్ డ్రోన్ కలకలం

బోర్డర్ లో పాక్ డ్రోన్ కలకలం

అంతర్జాతీయ వేదికల మీద తమకే పాపం ఎరుగం అన్నట్టు చెప్పే పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్‌ లోని ఫిరోజ్‌ పూర్‌ వద్ద ఉన్న హుస్సేనివాలా సరిహద్దు సమీపంలో పాక్‌కు చెందిన డ్రోన్‌ను భారత సరిహద్దు భద్రతా దళాలు గుర్తించాయి. పాక్‌కు చెందిన డ్రోన్‌ ఐదు సార్లు అక్కడే చక్కర్లు కొట్టి ఓసారి భారత సరిహద్దును కూడా దాటినట్టు తేలింది. పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద రాత్రి 10గంటల నుంచి 10:40 వరకు రౌండ్లు కొట్టి తిరిగి అర్ధరాత్రి 12:25 గంటల సమయంలో భారత సరిహద్దును దాటింది. దీన్ని గమనించిన భారత జవాన్లు వెంటనే సీనియర్‌ అధికారులను అప్రమత్తం చేశారు.

దీంతో సరిహద్దు రక్షక దళాలు, పంజాబ్‌ పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్స్ ద్వారా ఉగ్రమూకలు డ్రగ్స్‌, మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నారేమోనన్న సందేహంతో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు వారాల క్రితం ఇలాగే అనుమానాస్పదంగా తిరుగుతున్న రెండు డ్రోన్లను పంజాబ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ తీవ్ర అసహనంతో ఉంది.