ల్యాండ్ లైన్ నుంచే చాటింగ్, వీడియో కాలింగ్...

ల్యాండ్ లైన్ నుంచే చాటింగ్, వీడియో కాలింగ్...

మార్కెట్‌లోకి విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి... మొబైల్ ఫోన్స్ తయారీ కంపెనీలు పోటీపడి మరీ రోజుకో మోడల్ అనే తరహాలో కొత్తకొత్త హంగులతో మొబైల్ ఫోన్లను ఆవిష్కరిస్తూ పోతున్నాయి. వీటికి తోడు టెలికం సంస్థల మొబైల్ డేటా ఆఫర్లు... దీంతో మొబైల్ ప్రవేశానికి ముందూ టెలికం శక్తిగా ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్లు క్రమంగా మాయమై పోతున్నాయి. అయితే మళ్లీ ల్యాండ్ లైన్ ఫోన్లను ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తోంది. ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచి ఎస్ఎంఎస్‌లు, చాటింగ్, వీడియో కాల్స్, రింగ్ టోన్స్ సెట్ చేసుకోవడం లాంటి కొత్త ఆప్షన్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో టెలికం ఎక్సేంజీల్లో అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. 

ఈ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా... మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. అయితే ఈ కొత్త సదుపాయాలు పొందాలంటే ఐపీ ఫోన్‌కు అప్ గ్రేడ్ కావాల్సి ఉంటుందని తెలిపారు బుండి టెలికం జిల్లా మేనేజర్ బీకే అగర్వాల్. ల్యాండ్‌లైన్ యూజర్లు తమ ల్యాండ్ లైన్ ఫోన్ ను మొబైల్‌కు అనుసంధానం చేసుకోవచ్చని, ల్యాండ్ ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను మొబైల్ నుంచి కూడా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. దీని కోసం 2 జీ టవర్లు కాంబో బీటీఎస్‌కు అప్‌గ్రేడ్ అయ్యాయని తెలిపారు. బుండీ సిటీలో 86 మొబైల్ టవర్లు సహా 20 టవర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు.