నా విగ్రహాలు ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తాయి

నా విగ్రహాలు ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తాయి

ఉత్తరప్రదేశ్ లో తన విగ్రహాలు, పార్టీ గుర్తయిన ఏనుగు ప్రతిమలను స్థాపించేందుకు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయడం సరైనదేనని పేర్కొంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తన విగ్రహాలు స్థాపించాలని ప్రజలు కోరుకున్నారని మాయా తన అఫిడవిట్ లో తెలిపారు. అంతే కాకుండా విగ్రహాల స్థాపనకు ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు.

విగ్రహాల నిర్మాణానికయ్యే ఖర్చు కోసం బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని, దీనికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలియజేసిందని మాయావతి సుప్రీంకోర్టుకు తెలిపారు. సంఘ సంస్కర్తల విలువలు, ఆదర్శాలను ప్రచారం చేసే ఉద్దేశంతోనే విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, బీఎస్పీ ఎన్నికల గుర్తును ప్రచారం చేయడం తమ లక్ష్యం కాదని మాయావతి స్పష్టం చేశారు.

లక్నో, నోయిడాలలో తనవి, బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు బొమ్మల ఏర్పాటుకు ఖర్చు చేసిన ప్రభుత్వ సొమ్మును మాయావతి తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్ట్ ఫిబ్రవరిలో చెప్పింది. ప్రజాధనాన్ని తన విగ్రహాలు తయారు చేయించడం, తన పార్టీ ఎన్నికల గుర్తును ప్రచారం చేసేందుకు ఎలా ఉపయోగిస్తారని ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. 

తనవి, తన ఎన్నికల గుర్తు విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు వినియోగించిన ప్రజాధనాన్ని మాయావతి ప్రభుత్వ ఖజానాకు తిరిగి చెల్లించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం అభిప్రాయపడింది.