బడ్జెట్ లో ఆదాయపన్ను శ్లాబులు పెంచాలి

బడ్జెట్ లో ఆదాయపన్ను శ్లాబులు పెంచాలి

బడ్జెట్ లో ఆదాయపన్ను శ్లాబులు పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) పిలుపునిచ్చింది. ప్రస్తుత ఆదాయపన్ను నిర్మాణంలో అత్యధిక ఆదాయ రేటు 30 శాతం వర్తించే ఆదాయ పరిమితిని తొలగించాలని కోరింది. 'ప్రస్తుతం రూ.10 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు గరిష్ట పన్ను రేటు 30 శాతాన్ని వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ ఇతర దేశాలలో గరిష్ట రేటు వర్తించే ఆదాయ స్థాయి గణనీయంగా ఎక్కువని' పేర్కొంది. 

ప్రస్తుతం, రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్న వ్యక్తిని ఎలాంటి ఆదాయపన్ను చెల్లించకుండా మినహాయిస్తున్నారు. అంతకు మించి రూ.2,50,001-రూ.5,00,000 శ్లాబులో ఆదాయం సంపాదిస్తున్నవాళ్లు 5 శాతం రేటు ప్రకారం ఆదాయపన్ను చెల్లించాల్సి వస్తోంది. రూ.5,00,001-రూ.10,00,000 వరకు ఆదాయం ఉన్నవారు 20 శాతం, రూ.10 లక్షలకు మించి సంపాదించేవాళ్లు 30 శాతం పన్ను కడుతున్నారు. పైన పేర్కొన్న పన్ను రేట్లకు తోడు ఆదాయ పన్ను చెల్లింపుదారులు 4 శాతం విద్య, వైద్య సెస్ కడుతున్నారు. 

బడ్జెట్ కి ముందు ఫిక్కీ సమర్పించిన వినతిపత్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యధిక పన్ను రేటు విధించేందుకు ఆదాయ స్థాయిలను పెంచాల్సిన అవసరం ఉందని కోరింది. రూ.0-రూ.3 లక్షలకు పన్ను ఉండరాదని, రూ.3-5 లక్షలకు 5 శాతం, రూ.5-10 లక్షలకు 10 శాతం పన్ను, రూ.10-20 లక్షలకు 20 శాతం ఆదాయపన్ను, రూ.20 లక్షలపైన 30 శాతం పన్ఉ విధించాలని సిఫార్సు చేసింది. రూ.50 లక్షలు, రూ.1 కోటి ఆదాయం ఉన్నవారిపై సర్ ఛార్జి తొలగించాలని సూచించింది.