అమరావతిలో టీడీపీ నేతలు 40 వేల కోట్ల కుంభకోణం !

అమరావతిలో టీడీపీ నేతలు 40 వేల కోట్ల కుంభకోణం !

ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టింది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉంటాయని మంత్రి బుగ్గన ప్రకటించారు. విశాఖలోనే సచివాలయం, రాజ్‌భవన్, హెచ్‌వోడీ కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. అమరావతిలో చట్టసభలు, కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయపరమైన శాఖలన్నీ ఉంటాయని తెలిపారు. టీడీపీ నేతలు రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం చేశారని బుగ్గన ఆరోపించారు. పయ్యావుల, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహనరావులకు రాజధానిలో భూములున్నాయని చెప్పారు.

యనమల వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయని విక్రమసింహ పేరుమీద పయ్యావుల భూమి కొనుగోలు చేశారని వివరించారు. అంతేకాక చంద్రబాబు కూడా హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో 14.25 ఎకరాల భూమిని కొన్నారని బుగ్గన ఆరోపించారు. మొత్తం రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు 4 వేల 70 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారని అన్నారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే వీళ్లంతా భూములు కొనుగోలు చేశారని చెప్పారు.

ఏయే నేతలు ఎంత భూములు కొన్నారో చదివి వినిపించారు. టీడీపీ నేతలంతా కలసి మొత్తం 40 వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు మంత్రి బుగ్గన. అమరావతిలో ఎక్కువ భూములు కొన్నిది వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులే అని అన్నారు. ఏపీ ఎన్నార్టీ వేమూరి రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్లపై భూములున్నాయని చెప్పారు. పరిటాల సునీత కుమారుడి పేరు మీద కూడా భూములున్నాయని తెలిపారు. ధరణికోటలో ఆమె కుటుంబ సభ్యులు భూములు కొన్నారని చెప్పారు.