తెలంగాణకు ఏపీ ఆస్తులు.. బుగ్గన వెర్షన్‌ ఇదీ..

తెలంగాణకు ఏపీ ఆస్తులు.. బుగ్గన వెర్షన్‌ ఇదీ..

హైదరాబాద్‌లో ఉన్న ఏపీకి చెందిన ఆస్తులను తెలంగాణకు ఇవ్వలేదని.. తెలంగాణకు చెందిన భవనాలను మాత్రమే ఇచ్చేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీలో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పేశారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో బుగ్గన స్పందించారు.  2024 తర్వాత ఎలాగూ తెలంగాణకు ఆస్తులు అప్పచెప్పాలన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని భవనాలు 2024 వరకు మనకు చెందుతాయని, ఆ తర్వాత అవి తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు. 'ఎమ్మెల్సీ కొనుగోళ్లలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి వచ్చేశారు. అప్పుడు హుటాహుటిన పారిపోయి వచ్చి.. ఇప్పుడు భవనాలు వదిలేసి వచ్చామని అంటున్నారు' అని బుగ్గన అసహనం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధుల పంపకాల వంటి పెద్ద పెద్ద విషయాల్లో సామరస్యంగా పంపకాలు చేసుకోవాలన్న సదుద్దేశం తమకు ఉన్నదని ఆయన తెలిపారు.