'బుమ్రా లేకపోవడం టీమిండియాకు సమస్యే'

'బుమ్రా లేకపోవడం టీమిండియాకు సమస్యే'

భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ పర్యటనలో లేకపోవడం జట్టుకు పెద్ద సమస్యే అని భారత మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. తాజాగా టి-20ల్లో పసికూన ఐర్లాండ్‌పై భారత్‌ విజయం సాధించింది. ఈ సిరీస్ లో భారత ఆటను చూస్తే కొత్తగా టెస్టు హోదా పొందిన జట్టుకు, ఓ అగ్రశ్రేణి జట్టుకు మధ్య ఉన్న తేడా  స్పష్టంగా అర్థమవుతుంది. ఐర్లాండ్‌ ఆటగాళ్లు కౌంటీల్లో ఆడటం మంచిది.. కౌంటీ చాంపియన్‌షిప్‌ 1970ల్లో ఉన్నంత బలంగా లేకపోయినా కౌంటీల ద్వారా టి-20ల్లో ఐర్లాండ్‌ మెరుగయ్యే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌ టి-20ల్లో నంబర్‌వన్‌ జట్టు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా పొట్టి ఫార్మాట్‌లో పాల్గొని ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్నారు.

ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టి-20లో గాయపడిన బుమ్రా ఇంగ్లాండ్ పర్యటనలో లేకపోవడం జట్టుకు పెద్ద సమస్యే. బుమ్రా జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. బుమ్రా స్థానంలో వచ్చిన మరో పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ సరైన ప్రత్యామ్నాయమే. ఐర్లాండ్‌పై అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇక స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌ యాదవ్‌లు ఇంగ్లాండ్ పర్యటనలో  మరోసారి కీలకంగా మారాలి. మొదటి నుంచి భారత జట్టుది బలమైన బ్యాటింగ్‌ లైనపే. అయితే ధావన్, రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌ అంతా ఫామ్ లో ఉండటంతో కెప్టెన్‌ కోహ్లికి సవాల్‌గా మారింది. మిడిలార్డర్‌లో రైనా, పాండే, ధోని, పాండ్యా అందరూ హిట్టింగ్ చేయగలరు. లెఫ్ట్ హ్యాండర్ రైనా మిడిలార్డర్‌లో వైవిద్యం చూపెట్టే అవకాశం ఉంది. పాండ్యా, ధోనీలిద్దరు ఐర్లాండ్‌పై సిక్సర్లతో చెలరేగారు.. మిడిలార్డర్‌కు వారిద్దరు కీలకం. ఈ నేపథ్యంలో కోహ్లీ తుది జట్టులో ఎవరికీ ఓటేస్తాడనేది ఆసక్తిగా మారింది.