సీఎం బంగ్లా డిఫాల్టర్!!

సీఎం బంగ్లా డిఫాల్టర్!!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసం 'వర్షా'ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ డిఫాల్టర్ గా ప్రకటించింది. ఫడ్నవీస్ తన ఇంటి నీటి బిల్లు సుమారు రూ.7,44,981 కట్టలేదు. దీంతో ఆయన ఇంటిని బీఎంసీ డిఫాల్టర్ గా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఒక్కరే కాదు రాష్ట్ర ప్రభుత్వంలోని మొత్తం 18 మంది మంత్రులను బీఎంసీ డిఫాల్టర్లుగా ప్రకటించడం జరిగింది.

ఒక ఆర్టీఐ కారణంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో మహారాష్ట్రలోని అధికార నివాసాల్లో అంటే మంత్రులు, ఇతర నేతల ఆవాసాల నుంచి బీఎంసీకీ దాదాపు రూ.8 కోట్ల బకాయిలు ఉన్నట్టు తేలింది. ఆర్టీఐ ద్వారా వచ్చిన జాబితాలో మొదటి పేరు రాష్ట్ర ముఖ్యమంత్రిదే. ఫడ్నవీస్ కాకుండా పంకజా ముండే, ఏక్ నాథ్ షిండే, సుధీర్ మునగంటివార్, వినోద్ తావ్డే వంటి పెద్ద పెద్ద నేతల పేర్లు కూడా ఉన్నాయి. బీఎంసీపై చాలాకాలంగా శివసేన, బీజేపీలదే కబ్జా. అందువల్ల మంత్రుల బిల్లు చెల్లించకపోవడం పెద్ద విశేషమే కాకపోవచ్చు.