బురారీ డెత్ మిస్టరీ ఘటనలో మరో విషాదం

బురారీ డెత్ మిస్టరీ ఘటనలో మరో విషాదం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ సామూహిక హత్య కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. భాటీయా కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన పెంపుడు కుక్క టామీ కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందింది. ఇంట్లోని వారందరూ చనిపోవడం, ఆ భాదను తట్టుకోలేక మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఇంటి టెర్రస్‌పై గ్రిల్‌కు టామీని కట్టివేశారు. అప్పుడు అది 108 డిగ్రీల జ్వరంతో బాధపడుతోంది. అంబులెన్స్‌లో తరలించేందుకు ప్రయత్నించగా మొండికేసింది.

మీడియా ద్వారా ఈ పెట్‌ డాగ్‌ గురించి తెలుసుకున్న సంజయ్‌ మహపాత్ర అనే జంతు ప్రేమికుడు అనుమతితో జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. మొదట్లో ఆ డాగ్‌ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని తెలిపారు. దానికి ఎన్ని సపర్యలు చేసినా కోలుకోలేకపోయిందని, కుటుంబాన్ని కోల్పోయిన బాధ నుంచి అది తేరుకోలేకపోయిందని మహపాత్ర అన్నారు.

22 రోజుల క్రితం ఢిల్లీలోని బురారీలో ఒకే ఇంట్లో 10 మంది ఉరివేసుకోగా.. భాటియా ఇంటి పెద్ద నారాయణ్‌ దేవీ గొంతు తెగి రక్తపు మడుగులో కనిపించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన  ఈ కేసులో పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇంట్లోని వారంతా తాంత్రిక పూజల్లో పాల్గోనేవారని, ఇంట్లో దొరికిన రాతపూర్వక నోట్ల ద్వారా తెలుస్తుంది. దాని ఫలితంగానే కుటుంబసభ్యులు అందరు ఉరివేసుకుని చనిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు.