ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పై బుష్ ఫైర్ ఎఫెక్ట్...ప్లేయర్ల అస్వస్థత !

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పై బుష్ ఫైర్ ఎఫెక్ట్...ప్లేయర్ల అస్వస్థత !


ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అడవులను దహించేస్తోంది. దట్టమైన పొగ నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బుష్‌ ఫైర్‌ వల్ల ఇంత వరకూ ఆస్ట్రేలియన్లు ఇబ్బంది పడితే ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌ పైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఊపిరాడని పరిస్థితుల్లో ఆటను మధ్యలోనే ఆపి టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నారు ప్లేయర్లు. అయితే, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని ఆపేది లేదంటున్నారు నిర్వాహకులు. హార్డ్‌ టర్ఫ్‌ కోర్టుల్లో ఆటగాళ్లకు పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో అస్వస్థతకు గురవుతూ ఆటను మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్నారు ప్లేయర్లు. బుష్‌ఫైర్‌ పొగ వల్ల మారియా షరపోవా ఇబ్బందిపడ్డారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో సెకండ్‌ సెట్‌ మధ్యలోనే ఆటను ముగించింది వరల్డ్‌ మాజీ నెంబర్‌ వన్‌. వాతావరణ ప్రతికూలత వల్ల మ్యాచ్‌ రద్దు కావడం తనను ఎంతో బాధించిందని తెలిపారు షరపోవా. 

సోల్వేనియా క్రీడాకారిణి దలిలా జక్పోవిక్‌ ఏకంగా ఆట మధ్యలో కుప్పకూలిపోయింది. స్విస్‌ క్రీడాకారిణి స్టీఫెనీతో జరుగుతున్న మ్యాచ్‌ సమయంలో 28 ఏళ్ల దలిలా జక్పోవిక్‌ తీవ్ర అస్వస్థతకు గురైంది. దగ్గుతూ కిందపడిపోయింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ కావడంతో చివరికు క్వాలిఫైంగ్‌ మ్యాచ్‌కు దూరమైంది దలిలా. అలాగే, కెనాడా క్రీడాకారిణి ఎగునీ బోచార్డ్‌ కూడా అస్వస్థతకు గురైంది. తీవ్ర తలనొప్పి రావడంతో ఆట మధ్యలోనే మెడికోను పిలిపించి చికిత్స అందించాల్సి వచ్చింది. అస్ట్రేలియా వాతావరణ పరస్థితులపై ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత వాతావరణంలో ఆట కొనసాగించడం మంచి పద్ధతి కాదన్నారు జకోవిచ్‌. ఆటగాళ్ల ఫామ్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారాయన. 

ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ఇప్పటికే వేల హెక్కార్ల అడవి బూడిదయ్యింది. పెద్ద సంఖ్యలో జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. 2 వేల ఇళ్లు దెబ్బతినగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే వైల్డ్‌ ఫైర్‌ వల్ల ఈ స్థాయిలో నష్టం జరిగిన దాఖలాలు లేవు. కార్చిచిచ్చు వల్ల ఆస్ట్రేలియాలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మరోవైపు మునుపెన్నడూ లేని రీతిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఓ వైపు ఊపిరాడక... మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కరవుతున్నారు ఆస్ట్రేలియన్లు. మెల్‌బోర్న్‌లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదక స్థాయికి చేరుకున్నా... నిర్వాహకులు మాత్రం గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీని కొనసాగిస్తామంటున్నారు.