ట్రిపుల్ తలాక్ బిల్లుకు మళ్లీ ఆమోదం..

ట్రిపుల్ తలాక్ బిల్లుకు మళ్లీ ఆమోదం..

ట్రిపుల్ తలాక్‌ బిల్లుకు మరోసారి ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్ సమావేశం... మూడుసార్లు తలాక్ అని చెప్పడం కారణంగా ముస్లిం మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు గత లోక్‌సభ సమావేశాల్లో ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల రక్షణ) బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి లోక్‌సభ ఆమోదం తెలిపినా.. విపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడంతో రాజ్యసభలో నిలిచిపోయింది. మరోవైపు ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపకముందే 16వ లోక్‌సభ రద్దైపోయింది. అయితే, ఒక బిల్లు లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నా లోక్‌సభ రద్దైన పక్షంలో ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దయి పోతాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు మళ్లీ ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈసారి లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసే విధంగా ప్లాన్ చేస్తోంది కేంద్రం.