ఆర్ఈసీలో పూర్తి వాటా పీఎఫ్ సీకి అమ్మకం

ఆర్ఈసీలో పూర్తి వాటా పీఎఫ్ సీకి అమ్మకం

విద్యుత్ రంగ ఫైనాన్షియర్ ఆర్ఈసీ లిమిటెడ్ లో ఉన్న మొత్తం 52.63% ప్రభుత్వ వాటాను ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కి అమ్మడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని చేరుకొనేందుకు వరుసగా రెండో ఏడాది ప్రభుత్వం ఇలా నిర్ణయించింది. ఆర్ఈసీలోని 52.63% వాటాను, నిర్వహణ నియంత్రణను పిఎఫ్ సికి వ్యూహాత్మక అమ్మకం ద్వారా బదలాయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ‘2017-18 బడ్జెట్ లో ప్రకటించినట్టుగా ఒకే రంగంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే వాటిని ఏకీకరణ, సముపార్జన లేదా విలీనం చేస్తున్నాం. ప్రస్తుత వ్యవహారంలో కేబినెట్ సముపార్జన పద్ధతికి ఆమోదం తెలిపిందని‘ జైట్లీ అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డీల్ పూర్తవుతుందని భావిస్తున్నట్టు జైట్లీ చెప్పారు. దీనికి సంబంధించిన వ్యవహారాలను తను, ఈ వ్యవహారాలకు సంబంధించిన సెక్రటరీలు, మౌలికరంగ మంత్రి నితిన్ గడ్కరీలతో కూడిన కమిటీ తయారు చేస్తుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆర్ఈసీలో ప్రభుత్వ వాటా విలువ రూ.11,000 కోట్లుగా ఉంది.