పిల్లల్లో ఊబకాయానికి కారణం తెలిసింది

పిల్లల్లో ఊబకాయానికి కారణం తెలిసింది

పిల్లలకు ప్రేమతో ఏవేవో తినుబండారాలు పెడుతూ ఉంటాం. ముఖ్యంగా వారికిష్టమైన చాక్లెట్లు, కెఫీన్ తో కూడిన ఎనర్జీ డ్రింక్స్ తరచుగూ ఇస్తూ ఉంటాం. అయితే కొద్దిమోతాదులో పెద్దలు కెఫీన్ వాడవచ్చని కొన్ని సర్వేలు తేల్చిన దృష్ట్యా.. కెఫీన్ కంటెంట్ గల తినుబండారాలను పిల్లలు కూడా విరివిగా తీసుకుంటున్నారు. అయితే ఇది ఏ మాత్రం క్షేమకరం కాదని లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ చైర్మన్ రస్సెల్ వీనర్ తేల్చి చెబుతున్నారు. 

2014లో ఆయన ఆధ్వర్యంలో జరిగిన సర్వేను అందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. 11-15 ఏళ్ల పిల్లల్లో 5 వేల మంది మీద ఈ సర్వే నిర్వహించారు. దాని ప్రకారం వారానికి 2 నుంచి 4 సార్లు కెఫీన్ తీసుకునేవారు 14 శాతం మంది ఉండగా.. ప్రతిరోజూ తీసుకునేవారు 5 శాతం మంది ఉన్నట్టు తేలింది. 

ఎనర్జీ డ్రింక్స్ లో హై షుగర్ కంటెంట్ ఉండడం వల్ల శరీరంలో అవసరానికి మించి కేలరీలు పేరుకుపోతాయని దానివల్ల ఒబేసిటీకి దారి తీస్తున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఇంకా ఇటీవల జరిగిన మరికొన్ని అధ్యయనాలైతే పిల్లల మెదడు పనితీరు మీద కూడా ప్రభావం చూపుతున్నట్టు రుజువైందన్నారు. ఎనర్జీ డ్రింక్స్ లో లీటరుకు 320 మిల్లీ గ్రాముల మేర కెఫీన్ ఉంటుందని దీనివల్ల పిల్లల్లో యాంగ్జయిటీ, డిప్రెషన్, సెన్సేషన్ కోసం పాకులాడటం, సరిగా స్పందించకపోవడం, హైపర్ యాక్టివిటీ వంటి లక్షణాలు పెరుగుతున్నట్టు తేలిందన్నారు. కాబట్టి పిల్లల్లో శక్తికి, ఎదుగుదలకు కెఫీన్ కంటెంట్ గల డ్రింక్స్ వాడకూడదని ఆయన సలహా ఇస్తున్నారు.