ఇక, డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఉండవా..?

ఇక, డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఉండవా..?

పండుగలు వచ్చాయంటే ఆఫర్లు..! ప్రత్యేకమైన రోజులు వచ్చాయంటే ఆఫర్లు.. ఇలా ఈ -కామర్స్ సంస్థలు ఆఫర్లతో కస్టమర్లను ఆక్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.. భారీ డిస్కౌంట్లకు తోడు.. పలానా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే.. అదనపు డిస్కౌంట్‌తో పాటు.. క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.. అయితే, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు అందింది.. ఈ-కామర్స్ సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్స్ ప్రకటించడాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది అఖిల భారత వర్తక సమాఖ్య సంఘం (సీఏఐటీ) .. వినియోగదారులకు ఇలాంటి ప్రోత్సాహకాలు కల్పించడం ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని లేఖలో పేర్కొంది సీఏఐటీ.

ఇక, ఈ డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ల వెనుక అనైతిక ఒప్పందాలు ఉన్నాయని లేఖలో ఆరోపించారు సీఏఐటీ ప్రధాన జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్.. ప్రస్తుతం.. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ సహా పలు బ్యాంకులతో ఈ-కామర్స్ కంపెనీలు ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.. ముఖ్యంగా అమెజాన్, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌తో మోసపూరితమైన ఒప్పందాలు చేసుకుని ఆయా బ్యాంకు కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ప్రకటిస్తున్నాయని పేర్కొన్నారు.. అమ్మకందారుల నుంచి నేరుగా కొనుగోలు చేసే వారికి ఆ బ్యాంకులు ఎలాంటి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వవని గుర్తుచేసిన ఆయన.. ఈ-కామర్స్ కొనుగోళ్లపై మాత్రమే డిస్కౌంట్లను బ్యాంకులు ఎందుకు ఇస్తున్నాయని ప్రశ్నించారు.. ఈ ప్రత్యేక డిస్కౌంట్లపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది అఖిల భారత వర్తక సమాఖ్య సంఘం (సీఏఐటీ).