ఆమెజాన్ మీద ఏడు రోజుల బ్యాన్.. అసలు సంగతేంటి ?

ఆమెజాన్ మీద ఏడు రోజుల బ్యాన్.. అసలు సంగతేంటి ?

అమెజాన్ ఇండియా తన వెబ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించిన ఉత్పత్తుల యొక్క 'కంట్రీ ఆఫ్ ఆరిజిన్' తాలూకా వివరాలను అందించనందుకు కేవలం 25 వేల రూపాయల జరిమానా విధించినందుకు గాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) సీరియస్ అయింది. ఆ సంస్థకు అది చాలదని పేర్కొంటూ 7 రోజుల నిషేధాన్ని సిఎఐటి డిమాండ్ చేసింది. నియమాలు మరియు విధానాలను ఉల్లంఘించినందుకు అమెజాన్ మరియు ఇతర పెద్ద ఇ-కామర్స్ కంపెనీలపై నిషేధం విధించాలని సిఎఐటి డిమాండ్ చేసింది.

భారత చట్టాన్ని ఉల్లంఘించినందుకు విదేశీ ఇ-కామర్స్ దిగ్గజంపై ఇంత తక్కువ మొత్తాన్ని వసూలు చేయడం మన న్యాయ, పరిపాలన వ్యవస్థను అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదని సిఐఐటి జాతీయ అధ్యక్షుడు బి సి భారతి, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. శిక్ష మన ఆర్థిక వ్యవస్థపై కలిగే నష్టానికి సమానంగా ఉండాలని, ఇది మన చట్టాన్ని ఉల్లంఘించిన విదేశీ ఇ-కామర్స్ అందరికీ స్పష్టమైన సందేశాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

నవంబర్ 26 న, ఇ-కామర్స్ కంపెనీలను తన ప్లాట్‌ఫామ్‌లో విక్రయించే ఉత్పత్తుల యొక్క కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ని ప్రదర్శించమని ఆదేశించే నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు కేంద్రం అమెజాన్‌ కు జరిమానాలు విధించింది. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అక్టోబర్‌ లో ఈమేరకు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 19 నాటి ఆర్డర్ ప్రకారం అమెజాన్ యొక్క సమాధానం “సంతృప్తికరంగా లేదు” అని తేలినందున ఈ జరిమానా విధించబడింది. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనల ప్రకారం మొదటి నేరాలకు జరిమానా  డైరెక్టర్‌ కు రూ .25 వేలు. ఇక దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌కు ఇంకా జరిమానా విధించబడలేదు.