రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి తెర..

రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి తెర..

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది... రెండో విడతలో భాగంగా 180 జెడ్పీటీసీ, 1,913 ఎంపీటీసీ స్థానాలకు గాను.. ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగతా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎల్లుండి (ఈ నెల 10వ తేదీ) పోలింగ్ జరగనుంది. మేడ్చల్ - మల్కాజ్‌గిరి మినహా మిగతా జిల్లాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక బ్యాలెట్ పేపర్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తుండగా... ఎంపీటీసీ ఎన్నికలకు పింక్ కలర్, జెడ్పీటీసీ ఎన్నికలకు వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు 48 గంటల ముందు స్థానికేతర నేతలు ఎన్నికలు జరిగే మండలాల్లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు అధికారులు... ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసేవరకు ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులు మూతపడతాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రెండో విడత ఎన్నికలు ముగిసే వరకు పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికల చిహ్నాలను కూడా ప్రసారం చేయకూడదు.