అమెరికాలో ప్రదర్శనకు షాజహన్ కత్తి

అమెరికాలో ప్రదర్శనకు షాజహన్ కత్తి

17వ శతాబ్దంలో భారత్ ను ఏలిన షాజహాన్ వాడిన కత్తిని చూడాలనుకుంటున్నారా? అయితే శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఎగ్జిబిషన్ కు వెళ్లండి. అక్కడ ఒక్క షాజహాన్ వాడిందేం ఖర్మ.. భారత్ ను పరిపాలించిన మొఘల్ రాజవంశీకుల ఖడ్గాలు, నగలు, ఆభరణాలు, కిరీటాలు, ఇతర అలంకరణ వస్తువులు.. ఇలా ఎన్నింటినో చూడొచ్చు. శామ్యూల్ మోర్స్ అనే వ్యక్తి.. "ఈస్ట్ మీట్స్ వెస్ట్: జెవెల్స్ ఆఫ్ ద మహారాజాస్ ఫ్రమ్ ద అల్ థానీ కలెక్షన్" అనే పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాడు. అల్ థానీ కలెక్షన్ ను షేక్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ థాని.. అనే ఖతార్ కు చెందిన రాజవంశీకుడు ప్రారంభించాడు. ఆ సంప్రదాయాన్నే శామ్యూల్ మోర్స్ పాటిస్తున్నాడు. 

ఆయన నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో అద్భుతమైన, కళ్లు చెదిరే 150 కళాఖండాలు ఖతార్ రూలింగ్ ఫ్యామిలీ నుంచి అడిగి తీసుకొచ్చినవే కావడం విశేషం. కేవలం రెండేళ్లలోనే 400 కళాఖండాలను ఆయన సేకరించాడు. ఈ ప్రదర్శనలో 1526 నాటి మొఘల్ పాలకులు వాడిన కళాఖండాలు కూడా కొలువుదీరాయి. భారత్ లోకి యూరోపియన్లు ప్రవేశించి వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేసుకునేటప్పటికే.. ఇక్కడ మొఘలాయిలు అద్భుతమైన రాజభోగాలు అనుభవిస్తున్నారు. అసలు అలంకరణల విషయంలో కూడా యూరోపియన్లకు పెద్దగా తెలియదు. అది మహిళలకు సంబంధించిన వ్యవహారంగానే వారు భావించేవారు. అయితే భారత్ కు వచ్చాకే ఇక్కడి మొఘల్ రాజులు, రాజపుత్రులు, సైన్యాధికారులు అద్భుతంగా అలంకరించుకుంటారని తెలుసుకున్నారు. చెవి పోగులు, వజ్ర హారాలు, కిరీటానికి తగిలించుకునే ప్రత్యేకమైన అలంకరణలు, బంగారు కంకణాలు.. ఇవే కాకుండా వారు వాడే ఖడ్గాలను కూడా వజ్రాలు, పచ్చలతో పొదిగి అద్భుతంగా అలంకరించుకునేవారు. వారి రాజభోగం చూసి యూరోపియన్లు ఈర్ష్యపడ్డారని కూడా చెబుతారు. ఒక్క జహంగీర్ వాడిన ఆభరణాలే.. మొత్తం యూరోప్ లోని రాజులందరి ఆభరణాల కన్నా ఎక్కువని.. ఎగ్జిబిషన్ నిర్వాహకులు పరిశోధనాపూర్వకంగా చెబుతున్నాడు. అలాంటివాటిని శాన్ ఫ్రాన్సిస్కోలో చూడవచ్చు.