కేన్సర్ మందులను శక్తివంతం చేసే కీటోడైట్

కేన్సర్ మందులను శక్తివంతం చేసే కీటోడైట్

కీటో డైట్.. ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా చెప్పే ఒకేఒక మాట. బరువు తగ్గేందుకే కాదు.. కీటో డైట్‌ కేన్సర్‌ చికిత్సకు కూడా దోహదం చేస్తుందని అంటున్నారు కొలంబియా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు. శరీరంలో ఇన్సులిన్‌ కారణంగా యాక్టివేటయ్యే ఫాస్పాడైలినోసిటోల్‌ –3 (పీఐ3కే) అనే ఎంజైమ్‌లో మార్పులు జరిగితే కేన్సర్లు వచ్చే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే రసాయనాల ద్వారా కేన్సర్‌కు చెక్‌ పెట్టాలన్న శాస్త్రవేత్తల లక్ష్యం నెరవేరలేదు. దీనికి కారణం రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటంతో మందులపై దుష్ప్రభావం చూపుతున్నట్లు తేలింది.

దీంతో కీటోడైట్‌తో ఇన్సులిన్‌ మోతాదులను తక్కువ స్థాయిలో ఉంచితే ఎలా ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అప్పుడు పీఐ3కే ఉత్పత్తిని నిలిపే మందులు మెరుగ్గా పనిచేశాయి. పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే మందులు దాదాపు 20 వరకూ ప్రయోగాల దశలో ఉన్నాయి. మందులు వాడినప్పుడు కొందరిలో ఇన్సులిన్‌ స్థాయిలు గణనీయంగా పెరిగిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. కీటోడైట్‌తో ఇన్సులిన్‌ను సమర్థంగా నియంత్రించగలిగితే మందులతో జరిపే కేన్సర్‌ చికిత్స మరింత ప్రభావశీలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.