కోడెల మాకొద్దంటూ... కొవ్వొతుల ప్రదర్శన

కోడెల మాకొద్దంటూ... కొవ్వొతుల ప్రదర్శన

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార టీడీపీలో అసమ్మతి పెరుగుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమైన అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అసమ్మతి సెగ తప్పలేదు. కోడెల మాకొద్దు అంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు కొవ్వొతుల ప్రదర్శన నిర్వహించారు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వొద్దంటూ పార్టీ కార్యాలయంలోనే అసమ్మతి నాయకులు బుధవారం సమావేశమయ్యారు. కోడెల వద్దు అన్న నినాదాలతో పార్టీ కార్యాలయం మార్మోగింది. కోడెలకు వ్యతిరేకంగా వ్యూహరచన చేసే పనిలో మునిగిపోయారు అసమ్మతి నాయకులు. నరసరావుపేట ఎంపీగా కోడెలను పోటీ చేయించాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో అసమ్మతి సెగ ఆయనకు తలనొప్పిగా మారింది. ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. మరోవైపు తన కుమారుడికి నరసరావుపేట టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. కోడెలకు సత్తెనపల్లి టిక్కెట్‌ విషయంలో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరిలోను ఉత్కంఠ నెలకొంది.