మోడీ... మాటలతో కడుపు నిండుతుందా?

మోడీ... మాటలతో కడుపు నిండుతుందా?

'ప్రధాని మోడి మంచి మాటకారి.. కాని మాటలతో కడుపు నిండుతుందా?' అంటూ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు కాంగ్రెస్ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ. ఇవాళ ఆమె కర్ణాటక ఎన్నికల స్రచారంలో పాల్గొన్నారు. విజయపురలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ మోడీపై విమర్శల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు మోడీ తరచూ పాతతరం నేతలను గుర్తు చేస్తుంటారన్నారు. చరిత్రను వక్రీకరించడంలో మోడీ సిద్ధహస్తుడని ఆమె అన్నారు. రైతు సమస్యలపై చర్చించేందుకు తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అపాయింట్‌ మెంట్‌ అడిగితే... ఇవ్వకుండా దాటేసిన ప్రధాని మోడీ... కర్ణాటక రైతులను అవమాన పరిచారని సోనియా అన్నారు. కేంద్రం నుంచి సాయం లేకున్నా రాష్ట్రస్థాయిలోనే కాంగ్రెస్‌ అనేక అద్భుత పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇందిరా క్యాంటీన్ల గురించి ఆమె ప్రస్తావించారు. అనేక అంశాల్లో కర్ణాటక దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్‌ లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ... ప్రజల సంక్షేమాన్ని మరిచిపోయారని ఆమె ఎద్దేవా చేశారు.