రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లినట్టా.. వెళ్లనట్టా..?

రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లినట్టా.. వెళ్లనట్టా..?

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడెక్కడుంది..? సెలక్ట్ కమిటీకి వెళ్లినట్టా.. వెళ్లనట్టా..? మొన్న మండలిలో జరిగిన పరిణామాల దగ్గర్నుంచి నేటి వరకూ ఛైర్మన్ షరీఫ్ మాటలు కన్ఫ్యూజన్ కు తెరతీస్తున్నాయి. దీంతో అసలు బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిందా.. లేదా అన్న చర్చ మొదలైంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ మండలిలో పెద్ద యుద్ధమే నడిచింది. బిల్లు ఎలాగైనా రిజెక్ట్ చేసేలా చేయాలని వైసీపీ, సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ ఎత్తులకు పైఎత్తులు వేశాయి. చివరకు నాటకీయ పరిణామాల తర్వాత తనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి ఛైర్మన్ షరీఫ్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చెప్పారు. 

బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిందని ఫిక్సైన అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి. మీరు రూల్స్ ఉల్లంఘించారంటే.. మీరే అతిక్రమించారని మాటల తూటాలు పేల్చాయి. కానీ ఛైర్మన్ షరీఫ్ మాత్రం బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిందా.. లేదా అనేది క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. పంపించానని ఓసారి.. మధ్యలో ఆగిందని మరోసారి అర్థం కాకుండా వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ పరస్పర విరుద్ధమైన మాటలతో అందరిలో అయోమయం నెలకొంది. ఇంతకూ ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లు ఎక్కడుంది అనే చర్చ జరుగుతుంది. రూల్ ప్రకారం సెలక్ట్ కమిటీని ఛైర్మన్ ఫామ్ చేయాలి. 

ఓ వైపు మండలి నిరవధికంగా వాయిదా పడింది. ఇంకోవైపు మండలి రద్దు తీర్మానానికి వైసీపీ రెడీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్ట్ కమిటీ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఫామ్ అయినా బిల్లు ఆ కమిటీకి వెళ్తుందా.. లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే టీడీపీ మాత్రం బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిందని, విధివిధానాలకు సమయం పడుతుంది చెబుతోంది. ప్రభుత్వం కూడా సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్లినట్టు హైకోర్టులో చెప్పిన సంగతి గుర్తుచేస్తోంది. దీంతో మండలి ఛైర్మన్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి.. సెలక్ట్ కమిటీ విధివిధానాలపై అందరిలో ఆసక్తి నెలకొంది.