మళ్లీ రాజకీయాల్లోకి స్టార్ హీరో..!

మళ్లీ రాజకీయాల్లోకి స్టార్ హీరో..!

తమిళ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన కెప్టెన్‌ విజయకాంత్.. ఆ తర్వాత పార్టీని స్థాపించారు. అయితే, మొదట్లో పర్వాలేదు అనిపించినా.. తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రవర్తనే ఆయనకు శత్రువుగా మారింది. దీంతో ఆయన పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు కాదు కదా..! ఆయనకు కూడా విజయం సాధించలేదు. అయితే, కెప్టెన్ విజయకాంత్‌ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. విజయకాంత్ సింహంలా మళ్లీ రాజకీయాల్లోకి దూసుకొస్తారని ఆయన కుమారుడు విజయ ప్రభాకరన్‌ ప్రకటించారు. 

వేలూరు జిల్లా ఆంబూరు సమీపం ఉమరాబాద్‌లో డీఎండీకే ఆధ్వర్యంలో విజయకాంత్‌ జన్మదినోత్సవ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభకు హాజరైన విజయ ప్రభాకరన్‌.. పేదలకు సాయాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ... పేదరిక నిర్మూలన దినంగా జన్మదినోత్సవం నిర్వహించడం విజయకాంత్‌కు మాత్రమే సొంతమైందన్నారు. ఇక, తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను ఖండించారు.. కొందరు నేతలు ఉద్దేశ్యపూర్తకంగానే తన తండ్రి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కొంతసేపు భావోద్వేగానికి గురై కంట తడి పెట్టిన కెప్టెన్ కుమారుడు.. జనవరిలో కెప్టెన్‌ సింహంలా రాజకీయాల్లోకి మళ్లీ వస్తారని.. తన తల్లి ప్రేమలత పార్టీని నిర్వహిస్తున్నారని, ఆమె నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ స్థాపించగా.. ఇంకో వైపు రజనీకాంత్ రాజకీయ ప్రవేశం త్వరలోనే అనే ప్రచారం సాగుతోంది. కెప్టెన్ మళ్లీ ఎంట్రీ ఇస్తారట..! దీంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. అయితే, కమల్‌హాసన్, రజనీకాంత్.. రాజకీయాల్లో నాకు జూనియర్లు అంటూ కెప్టెన్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.