రివ్యూ : కేరాఫ్ కంచరపాలెం 

రివ్యూ : కేరాఫ్ కంచరపాలెం 

 

నటీనటులు : సుబ్బారావు, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు

మ్యూజిక్ : స్వీకర్ అగస్తి 

ఫోటోగ్రఫి : ఆదిత్య జువ్వాడి, వరుణ్ ఛాపేకర్ 

నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి 

దర్శకత్వం ; వెంకటేష్ మహా 

రిలీజ్ డేట్ : 07-09-2018 

నిజజీవితంలో నుంచి వచ్చే కొన్ని కథలు మనల్ని కొంత ప్రేరణకు గురి చేస్తాయి.  థ్రిల్లింగ్ ను కలిగిస్తుంటాయి. అలాంటి కథల్లో ఒకటి కేరాఫ్ కంచరపాలెం.  దగ్గుబాటి రానా సమర్పణలో వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దామా.  

కథ : 

కంచరపాలెం అనే గ్రామంలో నాలుగు జీవితాలకు సంబంధించిన కథ ఇది.  సుబ్బారావు అనే అటెండర్ 49 సంవత్సరాల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటాడు.  సుబ్బారావు పెళ్లి గురించే ఆ ఊర్లో చర్చ జరుగుతుంటుంది.  అదే సమయంలో ఆ ఊరికి ఒరిసా నుంచి ఆఫీసర్ రాధ వస్తుంది.  ఆమె భర్త చనిపోతాడు.  20 సంవత్సరాల కూతురు ఉంటుంది.  కూతురితో కలిసి అదే ఊర్లో ఉంటుంది.  అటెండర్ సుబ్బారావును చూసి రాధా ఇష్టపడుతుంది.  అదే ఊరికి చెందిన కార్తీక్ రత్నం, ప్రణీత పట్నాయక్ లు మరో ప్రేమ జంట.  ఇద్దరి మతాలు వేరు వేరు.  అనుకోకుండా ఈ ఇద్దరు ప్రేమలో పడతారు.  అదే ఊర్లో ఓ వైన్ షాప్ ఉంటుంది.  ఆ షాప్ లో మోహన్ భగత్ అనే వ్యక్తి ఉంటాడు.  ఆటను సలీమా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.  ఆ అమ్మాయి వేశ్య.  ఆ అమ్మాయి కళ్లంటే అతనికి చాలా ఇష్టం.  అదే ప్రేమలో పడేవిధంగా చేస్తుంది.  ఇక స్కూల్లో చదువుకునే కేశవ, నిత్యశ్రీలు ఒకరంటే ఒకరు ఇష్టపడుతుంటారు.  ఈ నాలుగు ప్రేమ కథలు ఎలా ముందుకు సాగాయి.  చివరకు ఏమైంది అన్నది చిత్ర కథ.  

విశ్లేషణ: 

జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకొని ఆనందించడం, కొన్నిసారు బాధపడటం జరుగుతుంటుంది.  ఇది సహజమే.  ఇలాంటి కథల సమూహారమే కేరాఫ్ కంచరపాలెం.  సమాజంలోని కులాలు, మతాలు, మనుషుల మధ్య అంతరాలు, వాటిని ఎత్తిచూపే ప్రయత్నాలు.. ఇవన్నీ ఈ సినిమాలో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి.  కంచరపాలెంలో కథ ప్రారంభం కాగానే.. అక్కడ ఒక్కొక్క పాత్రని మనకు పరిచయం చేస్తారు.  అక్కడి నుంచి ప్రయాణం మొదలౌతుంది.  నిజ జీవితంలోనుంచి వచ్చిన సహజసిద్ధమైన పాత్రలు కావడంతో.. అక్కడ అంతా సహజంగా జరుగుతున్నట్టే ఉంటుంది.  ఆయా పాత్రలు నవ్విస్తాయి..ఏడిపిస్తాయి ... అయ్యో ఇలా ఎందుకు జరిగింది అని వాళ్లపై జాలికలిగేలా చేస్తాయి.  అంత సహజసిద్ధంగా చిత్రీకరణ జరిగింది.  బహుశా ఇది జీవితాల్లో నుంచి పుట్టిన కథ ప్రభావం కావొచ్చు.  ప్రేమించిన అటెండర్ తో కలిసి జీవించేందుకు తల్లికి సహాయపడే కూతురు పాత్ర ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది.  తాను ప్రేమించిన అమ్మాయి ఒక వేశ్య అని తెలిసినా.. ఆమెతోనే పెళ్లి అని నిర్ణయం తీసుకొనే అబ్బాయి సాహసానికి ప్రతి ప్రేక్షకుడు విజిల్ వేయకుండా ఉండదు.  స్కూల్లో చదువుకునే వయసులోనే ఒకరంటే ఒకరు ఇష్టపడే పిల్ల ప్రేమికులు.. జాతరలో పాటల పుస్తకాలు కొనుక్కొని వాటిని పాడుకోవడం, తాటాకు గొడుగులు.. ఇలాంటి విషయాలు ఎన్నింటినో ఈ ప్రేమికుల పాత్రల ద్వారా గుర్తు చేస్తాడు దర్శకుడు.  ఇక ఈ నాలుగు ప్రేమకథల క్లైమాక్స్ దృశ్యాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది.  

నటీనటుల పనితీరు : 

ఇందులో ప్రతి పాత్రకు ఒక గుర్తింపు ఉంది.  కంచరపాలెం గ్రామంలోని ప్రజలే ఈ సినిమాలో నటించారు.  ఎవరికీ మేకప్ ఉండదు.  ప్రతి పాత్ర సహజసిద్ధంగా ఉండటంతో.. మన కథే అక్కడ జరుగుతున్నట్టుగా ఫీలవుతాం.  ఎవరి పాత్ర ఇందులో మైనస్ కాదు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమా గురించి చెప్పాలి అంటే దర్శకుడు వెంకటేష్ మహా గురించే చెప్పుకోవాలి.  ఇలాంటి కథలను ఎంచుకోవడం  సాహసంతో కూడుకున్నది.  కులమతాల మధ్య జరిగే సంఘర్షణను హృద్యంగా చిత్రీకరించాడు.  ఒక ప్రేమ కథను డీల్ చేయడమే కష్టంగా ఉన్నరోజుల్లో నాలుగు ప్రేమకథను అవీ సున్నితమైన భావోద్వేగాల మిళితమైన ఇలాంటి ప్రేమకథలను డీల్ చేయడం చాల కష్టం.  అయినప్పటికీ సినిమాను డీల్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.  స్వీకర్ అగస్తి సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.  ఫొటోగ్రఫీ సహజసిద్ధంగా ఉంది.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథనాలు 

నటీనటులు 

వాస్తవికత 

సాంకేతిక వర్గం 

బలహీనతలు : 

స్లో నెరేషన్ 

చివరిగా : కేరాఫ్ కంచరపాలెం.. ఇది వాస్తవ జీవితం