చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను చటాన్‌పల్లి దగ్గర ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు తెలంగాణ పోలీసులు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదైంది. షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. దిశ హత్య కేసు విచారణాధికారిగా ఏసీపీ సురేందర్ వ్యవహరిస్తున్నారు. దిశ మొబైల్ ఫోన్, వాచ్‌ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లగా.. అక్కడ నిందితులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసి.. అనంతరం వెపన్స్ లాక్కొని కాల్పులు జరిపేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టారు. నిందితుల దాడిలో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు కాగా.. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్‌ తనిఖీలు నిర్వహిస్తోంది... నిందితుల శరీరాల నుంచి బయటకు వెళ్లిన బుల్లెట్ల కోసం గాలిస్తున్నారు. మేటల్ డిటెక్టర్స్‌తో బుల్లెట్ల కోసం గాలిస్తున్న క్లూస్ టీమ్.. కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నిందితుల మృతదేహాలు ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉండగా.. ఇవాళ జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు ఈ మృతదేహాలను పరిశీలించనున్నారు.